
మొదటి అదనపు సివిల్ జడ్జిగా లలితాదేవి
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం మొదటి అదనపు సివిల్ జడ్జిగా కె.లలితాదేవి నియమితులయ్యారు. విశాఖ 7వ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ (స్పెషల్ మొబైల్ కోర్టు) నుంచి బదిలీపై వస్తున్నారు. పట్టణంలో మొదటి అదనపు సివిల్ జడ్జిగా ఉన్న డి.అరుంధతి గుడివాడ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ అయ్యారు.
పంట పొలాల్లో మైనింగ్ వద్దు
ఆగిరిపల్లి: పంట పొలాల్లో మైనింగ్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వొద్దని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనసానపల్లిలో కర్రగట్టు వద్ద 2.40 ఎకరాల అసైన్డ్ భూమిని గుంటూరుకు చెందిన వ్యక్తి కొనుగోలు చేశాడు. వ్యవసాయానికి కొను గోలు చేసిన భూమిలో క్వారీ ఏర్పాటుకు ప్రయ త్నాలు ముమ్మరం చేశారు. దీంతో గ్రామంలోని రైతులు, ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల మధ్య క్వారీకి అనుమతిస్తే పర్యావరణంతో పాటు, వ్యవసాయం కూడా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్‌ని కలిసి గోడు వెళ్ళబోసుకున్నారు. రెండు రోజుల నుంచి మైనింగ్ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆర్ అండ్ ఆర్ కాలనీ పరిశీలన
బుట్టాయగూడెం: జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం ఏజెన్సీలో పర్యటించారు. ఈ సందర్భంగా బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లోని ఆర్ అండ్ ఆర్ కాలనీలు సందర్శించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంతానికి వచ్చిన నాదెండ్లకు గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి కూడా గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కె.వెట్రి సెల్వి, ఐటీడీఏ పీఓ రాములు నాయక్, ఆర్డీఓ ఎన్‌వి.రమణ తదితరులు పాల్గొన్నారు.
వక్ఫ్ చట్టం సారాంశం వివరిస్తూ కరపత్రం
ఏలూరు (టూటౌన్): దశాబ్దాలుగా పేద ముస్లింలు, ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయడానికి వక్ఫ్ చట్టాన్ని ప్రధాని మోదీ తీసుకొచ్చారని.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ విక్రమ్ కిషోర్ అన్నారు. స్థానిక అశోక్ నగర్ బీజేపీ కార్యాలయంలో వక్ఫ్ చట్టం (సవరణ )2025 సారాంశం వివరణ కరపత్రాన్ని మంగళవారం విడుదల చేశారు. ఈ చట్టంపై అన్ని వర్గాల ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కలిగించటానికి జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టిందన్నారు.
వేతన బకాయిలు చెల్లించాలి
భీమవరం: ఉపాధి హామీ కూలీల వేతన బకా యిలు తక్షణం విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు హెచ్చరించారు. భీమవరంలోని కలెక్టరేట్ వద్ద మంగళవారం ఉపాధి హామీ కూలీల సమస్యలపై ధర్నా నిర్వహించారు.
గోనె సంచుల కొరతపై ఫిర్యాదు
ఉండి: ధాన్యం అమ్మకంలో గోనె సంచుల కొరత ఉందని, రైతులు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మంగళవారం ఉండి మండలం యండగండి రైతు సేవా కేంద్రాన్ని జేసీ పరిశీలించారు. ధాన్యం అమ్మకానికి రైతులంతా సిద్ధంగా ఉన్నారని.. అయితే గోనె సంచుల కొరత ఉందని రైతులు చెప్పారు. దీనిపై స్పందించిన జేసీ రైసుమిల్లర్లతో నేరుగా మాట్లాడి రైతులకు 20 వేల గోనె సంచులు వెంటనే అందుబాటులో ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రైతులతో కలసి తేమశాతం పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులకు అధికారులు సహకరించకపోతే తెలియచేయాలని సూచించారు. మిల్లుకు ధాన్యం తోలిన 48 గంటల వ్యవధిలోనే రైతు ఖాతాలో నగదు జమచేస్తామన్నారు. గోనె సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జేసీ ఆదేశించారు.

మొదటి అదనపు సివిల్ జడ్జిగా లలితాదేవి