
వేసవిలో చర్మం తరచూ జిడ్డు అవుతుంటుంది. ఎండ వేడికి చర్మం మండుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఈ సమస్య తగ్గడంతో పాటు చర్మానికి తాజాదనం రావాలంటే సహజ సిద్ధమైన ఉత్పాదనలు మేలు చేస్తాయి.
అలోవెరా జ్యూస్‌కు, కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి శరీరానికి తరచూ మసాజ్ చేస్తూ ఉంటే ఎండ కారణంగా నల్లబడిన చర్మం సహజకాంతికి వస్తుంది. చర్మం మండడం సమస్య కూడా తగ్గుతుంది. దురద, దద్దుర్లు.. ఇతర చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.
జిడ్డుచర్మం గలవారికి వేసవి మరింత పరీక్ష పెడుతుంది. చమట అధికమై బయటి దుమ్ము, ధూళి చేరి చర్మం మరింత జిడ్డుగా తయారవుతుంది. పాలు, తేనె, నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి చర్మం కమిలి, నల్లబడిన చోట రాయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి.
వేప ఆకుల ముద్ద, నారింజ తొనల ముద్ద సమానపాళ్లలో తీసుకోవాలి. దీంట్లో చిటికెడు గంధం పొడి, ముల్తానీమిట్టి, తేనె, నిమ్మరసం, రోజ్‌వాటర్ కలిపి, ముఖానికి ΄్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి.
టీ స్పూన్ నారింజ రసం, ఓట్స్, తేనె, గుడ్డులోని తెల్లసొన లేదా పెరుగు కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, వలయకారంగా మృదువుగా స్క్రబ్ చేయాలి. తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి.
బియ్యప్పిండిలో చిటికెడు పసుపు, తేనె, దోస రసం కలిపి పేస్ట్‌లా చేయాలి. ముఖానికి పట్టించి, ఆరాక శుభ్రపరుచుకోవాలి. మేనికి కూడా ఇది మేలైన ΄్యాక్.
ఎండలో బయటికి వెళ్లి వచ్చిన తర్వాత ఐస్‌ప్యాక్ లేదా ఐస్ క్యూబ్‌తో ముఖానికి మృదువుగా రబ్ చేయాలి. ఎండవేడికి కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది.