ఎండలు బాబోయ్‌ ఎండలు... చుండ్రు తగ్గేదెలా..? | How to Prevent Dandruff In Summer east Tips | Sakshi
Sakshi News home page

చుండ్రు తగ్గేదెలా..?

Published Sat, May 20 2023 12:05 PM | Last Updated on Sat, May 20 2023 12:05 PM

How to Prevent Dandruff In Summer east Tips - Sakshi

వేసవిలో తలకి ఎక్కువ చెమట పట్టడం, దానికితోడు వాతావరణ కాలుష్యం వల్ల తల తొందరగా మురికిపడుతుంది. అందువల్ల తరచు తలస్నానం చేయాలి. అలా తలస్నానం చేయకపోవడం వల్ల అంతకుముందు చుండ్రు లేనివారికి చుండ్రు వచ్చే అవకాశం ఉంది. ముందే చుండ్రు ఉన్నవారిని ఆ సమస్య మరింతగా వేధిస్తుంది. చుండ్రు సమస్యను తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. 

►వేసవిలో చాలామందిని చుండ్రు సమస్య వేధిస్తుంటుంది. తలలో అమితంగా  పొట్టు చేరడం, తలంతా దురద.. ఈ సమస్యలు ఎండాకాలంలో కాస్త ఎక్కువుంటాయి. అలాంటపుడు ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.

అవేమిటో చూద్దాం...
►వేప నూనె లేదా వేప ఆకులను గుజ్జుగా చేసి తలకు పట్టించాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. దీనివల్ల చుండ్రు సమస్యే కాదు, దురద కూడా తగ్గుతుంది.

►నాలుగు స్పూన్ల గోరువెచ్చని కొబ్బరి నూనెలో అరచెంచా నిమ్మరసం కలపాలి. దీన్ని తలకు పట్టించి గంట తరువాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి.

►పెరుగు కూడా బాగానే పని చేస్తుంది. కప్పు పెరుగును తలంతా పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా చాలు.

►కలబంద గుజ్జును తలకు పట్టించినా ఫలితం ఉంటుంది. అలోవెరా జెల్‌ ను కుదుళ్లకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి.

►పావు కప్పు యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను పావు కప్పు నీళ్లలో కల΄ాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు తడిగా ఉన్నపుడు మాడుకు పట్టించాలి. అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయొచ్చు.

చుండ్రు ఎందుకు వస్తుంది?
►చుండ్రుకు ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, నిద్రలేమి. అయితే ఎండాకాలంలో చెమట వల్ల ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, ఈస్ట్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

►షాంపూను ఎక్కువగా వాడటం వల్ల మాడు పొడుబారుతుంది. దీనివల్ల చుండ్రు సమస్య వస్తుంది.

►కొందరికి జడను గట్టిగా బిగించి కట్టుకోవడం అలవాటు. అయితే అలా జుట్టును బిగుతుగా అల్లుకోవడం వల్ల గాలి తగలక సమస్య తీవ్రమవుతుంది.

►ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల జుట్టు పొడిబారుతుంది. అందువల్ల తల మీద ఎండపడకుండా తలను కవర్‌ చేసేందుకు ఏమైనా వాడాలి.

►చెమట వల్ల చికాకుగా ఉండి ఎక్కువసార్లు తలస్నానం చేస్తుంటాం. దీనివల్ల కూడా చర్మం పొడిబారి చుండ్రు సమస్య వస్తుంది.

ఇవి పాటించాలి
►వారానికి మూడుసార్లు తలస్నానం చేయాలి. ముఖ్యంగా ఎండాకాలంలో మాడునుంచి నూనెలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి, దీనివల్ల దుమ్ము, దూళి చేరి చుండ్రు ఎక్కువవుతుంది.

►తరచూ తల ముట్టుకోకూడదు. అంటే తలలో చేతులు పెట్టి గోక్కోకూడదు. చుండ్రు వల్ల దురద వస్తుంది. దాంతో తరచూ తలలో చేయి పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్‌ ఎక్కువవుతుంది. సమస్య ఇంకాస్త పెరుగుతుంది.

►ఎండాకాలంలో హెయిర్‌ స్టైలింగ్‌ కోసమని క్రీములు, స్ప్రేలు ఎక్కువగా వాడితే అవి మాడును పొడిబారేలా చేసి చుండ్రును పెంచుతాయి.

►వారానికి ఒకసారైనా ఏదైనా ఆయిల్‌తో కుదుళ్లకు బాగా మర్దనా చేసుకోవాలి. దీనివల్ల మంచి రక్త సరఫరా జరుగుతుంది. మాడులో ఉండే చర్మ కణాల పనితీరు మెరుగుపడి చుండ్రు సమస్య తగ్గే అవకాశం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement