
ప్రపంచ పర్యాటక రంగంలో పేరు తెచ్చుకుంటున్న దేవమాలి పర్వత పరిరక్షణకు ప్రభుత్వం కఠిన ఆంక్షలు పెడుతోంది. ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తన నూతన చిత్రానికి సంబంధించి ఇక్కడ షూటింగ్ చేయడంతో ఈ ప్రాంతం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆయన షూటింగ్ ముగించుకుని వెళ్లిపోతూ ఈ పర్వతంపై పర్యాటకులు చెత్త వదిలి వెళ్లడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై అనేక విజ్ఞప్తులు వచ్చాయి. అప్పటి నుంచి ప్రభుత్వం ఈ పర్వత పరిరక్షణ పై తీవ్రంగా దృష్టి సారించింది.
రాత్రిపూట రాకపోకలు నిషేధం
దేవమాలి పర్వతం మీద సూర్యోదయం, సూర్యాస్తమయం చూడడానికి పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. అందుకే గుడారాలు వేసి రాత్రి బస చేస్తుంటారు. దీంతో రాత్రి ఇక్కడ పర్యవేక్షణ ఉండేది కాదు. ఈ క్యాంప్ ఫైర్‌ల వల్ల ఔషధ మొక్కలు కాలిపోయేవి.
విందు వినోదాల కారణంగా చెత్త పేరుకుపోయేది. అందుకే రాత్రి 8 నుంచి ఉదయం 5 వరకు దేవమాలిపై పర్యాటకులు ఉండకూడదని నిషేధం విధించారు. 2023 నాటి భారతీయ నాగరిక సురక్ష సంహిత 163 ప్రకారం,1986 నాటి పర్యవరణ పరిరక్షణ చట్టం 15 ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేశారు.
వ్యర్థాలపై కఠిన చర్యలు
దేవమాలిపైకి వచ్చే పర్యాటకులు తాము తెచ్చే వ్యర్థాలు తామే తిరిగి తీసుకొని వెళ్లేటట్లు సంచులు తెచ్చుకోవాలని రాజమౌళి సూచించారు. దాన్నే ప్రభుత్వం కఠిన నిబంధనగా మార్చింది. ఇకపై పర్యాటకులు అక్కడ వ్యర్థాలు వదల రాదని, తిరిగి తీసుకొని వెళ్లడానికి సంచులు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు పైకి తీసుకురావద్దని హెచ్చరించింది.
అధికారుల పర్యటనలు
కొరాపుట్ కలెక్టర్ వీ.కీర్తి వాసన్ ఆదివారం దేవమాలి పర్వతంపై ఉన్నత స్థాయి అధికారులతో పర్యటించారు. రక్షణ చర్యల పై ఎస్పీ రోహిత్ వర్మ కూడా వెళ్లారు. ఇదే సమయంలో సీఎల్పీ నాయకుడు రామచంద్ర ఖడం కూడా అదే సమయంలో తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా అక్కడకే వెళ్లారు. వీరంతా అనుకోకుండా కలుసుకోవడంతో అక్కడే సమావేశమయ్యారు. దేవమాలి పై భారీ ఎత్తున పర్యాటక సదుపాయాలు కల్పించడానికి కలెక్టర్ సమీక్ష చేశారు.
(చదవండి: ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట రామాలయం..)