
తెలంగాణలో 2.5 రెట్లు పెరిగిన కిడ్నీ రాళ్ల కేసులు
తగిన జాగ్రత్తలతోనే ఈ సమస్య దూరం
ఏఐఎన్‌యూ వైద్యుల సూచనలు
హైదరాబాద్ తెలంగాణలో వేసవి ముదురుతోంది. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌ల కిడ్నీలలో రాళ్లు ఏర్పడే కేసులు రెండు నుంచి రెండున్నర రెట్లు పెరిగాయని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) తన నివేదికలో తెలిపింది. డీహైడ్రేషన్, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, విపరీతంగా ఎండల్లో తిరగడం వల్ల రోజుకు సుమారు 300 నుంచి 400 మంది రోగులు కిడ్నీలో రాళ్ల సమస్యతో రావడంతో వారికి ఏఐఎన్‌యూల చికిత్సలు చేస్తున్నారు. వేసవి అంటేనే “స్టోన్ సీజన్” అంటారు. ఈ కాలంలో ముఖ్యంగా కిడ్నీలకు చాలా ప్రమాదం ఉంటుంది. ప్రధానంగా శరీరంలో నీరు ఆవిరి అయిపోవడం, ఉప్పు ఎక్కువగా తినడం, తగినంత నీరు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల వేసవిలో కిడ్నీలలో రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయి.
ప్రధానాంశాలు:
రోజుకు సగటున 300 నుంచి 400 వరకు కిడ్నీలో రాళ్ల కేసులు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇది బాగా ఎక్కువ.
రాష్ట్ర వ్యాప్తంగా శీతాకాలంతో పోలిస్తే ఈ బాధితుల సంఖ్య రెట్టింపు దాటిపోయింది.
జంక్ ఫుడ్ తినడం, ఎక్కువగా కదలకపోవడం, తగినంత నీరు తాగకపోవడంతో పిల్లలు, యువతలో ఈ సమస్య ఎక్కువవుతోంది.
10-17 సంవత్సరాల మధ్య పిల్లల్ల రాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాఠశాలలో ఉన్నప్పుడు నీళ్లు తాగకపోవడం, స్నాక్స్ ప్యాకెట్లు కొని తినడం, కూల్ డ్రింకులు తాగడం దీనికి కారణం.
పురుషులతో పోలిస్తే మహిళలకు ఈ సమస్య కొంత తక్కువే (సుమారు 40% తక్కువ). కానీ, గర్బవతులుగా ఉన్నప్పుడు ఈ సమస్య వచ్చి, గుర్తించకపోతే ముప్పు ఎక్కువ.
పిల్లల్లో ఈ సమస్య వల్ల దీర్ఘకాలంలో వారి కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
ఈ సందర్భంగా ఏఐఎన్‌యూకు చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ తైఫ్ బెండెగెరి మాట్లాడుతూ, “కిడ్నీలో రాళ్ల కేసులు ఈసారి అసాధారణంగా పెరిగాయి. ముఖ్యంగా పిల్లలు, యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. వేడి పెరిగిపోవడం, తగినంత నీరు తాగకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. పాఠశాలకు వెళ్లే పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల వారికి ఈ కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువ అవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రాళ్ల సమస్య కేవలం పెద్దవాళ్లది అనుకోకూడదు. పిల్లల తల్లిదండ్రులతో పాటు పాఠశాలలు కూడా దీనిపై అవగాహన పొందాలి. తగినంత నీళ్లు తాగడం, సరైన ఆహారం తీసుకోవడం, సమస్యను త్వరగా గుర్తించడం వల్ల చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా.. వేసవి నెలల్ల ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి” అని సూచించారు.
జాగ్రత్తగా ఉండండిలా...
తగినన్ని నీళ్లు తాగాలి. మూత్రం స్పష్టంగా, లేతరంగులో ఉండేలా చూసుకోవాలి.
ఉప్పు, ప్రాసెస్డ్ ఆహారం, జంతువుల కొవ్వు పదార్థాల వాడకం తగ్గించాలి.
ముఖ్యంగా పిల్లల్లో జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ చిరుతిళ్లు, కూల్ డ్రింకుల వాడకం మానేయాలి.
స్కూల్లో ఉన్నప్పుడు, ఇళ్ల దగ్గర కూడా తగినన్ని నీళ్లు తాగేలా చూడాలి
కుటుంబంలో ఎవరికైనా గతంలో కిడ్నీ రాళ్లు ఏర్పడితే మరింత జాగ్రత్తగా ఉండాలి.
ఎప్పటికప్పుడు కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలకు కారణం లేకుండా కడుపునొప్పి రావడం, తరచు మూత్ర విసర్జనకు ఇబ్బంది పడడం లాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులకు చూపించాలి. తగినన్ని నీళ్లు తాగడం చాలావరకు ఈ సమస్యను దూరం పెడుతుంది.