
యువతలో తీవ్రమైన మానసిక గందరగోళం
ఆహారంతో పాటు ఇతర అలవాట్లూ కారణమే..
వెల్లడించిన సేపియన్ ల్యాబ్స్ అధ్యయనం
మానసిక ఆరోగ్య స్థాయిల్లో అట్టడుగున నగరం
ప్రపంచవ్యాప్త అధ్యయనం ప్రకారం నగర యువత మానసిక ఆరోగ్యం బాగా క్షీణిస్తోంది. అంతర్జాతీయంగా సేపియన్ ల్యాబ్స్ సంస్థ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ రిపోర్ట్ దీనిని వెల్లడించింది. మానసిక ఆరోగ్యం ( World Mental Health Index )అత్యల్పంగా ఉన్న భారతదేశపు మెట్రో నగరాల్లో హైదరాబాద్‌కు అట్టడుగున స్థానం కల్పించింది. మెంటల్ హెల్త్ కోషియంట్(ఎంహెచ్‌క్యు) స్కేల్‌లో నగరం ప్రపంచ సగటు 63 కాగా మన నగరం 58.3 స్కోర్‌ను సాధించింది. ఢిల్లీ 54.4 స్కోర్‌తో మన తర్వాత స్థానంలో నిలిచింది. ఈ అధ్యయనం కోసం సంస్థ 18 నుంచి 55 ఆ తర్వాత వయస్సు కలిగిన 75 వేల మంది వ్యక్తులను ఎంచుకుంది. – సాక్షి, సిటీబ్యూరో
ఎంహెచ్‌క్యు స్కేల్ మానసిక ఆరోగ్యాన్ని ‘బాధలో ఉండటం’ నుంచి ‘అభివృద్ధి చెందడం’ వరకు విభజించింది. ‘ఎండ్యూరింగ్’ ‘మేనేజింగ్’ కేటగిరీల మధ్య హైదరాబాద్ సగటు పడిపోయింది. నగరంలో ‘32% మంది ‘బాధపడుతున్న’ లేదా ‘కష్టపడుతున్న’ కేటగిరీల్లోకి వచ్చారు. ఇది పేలవమైన భావోద్వేగ నియంత్రణ, బలహీనమైన సంబంధాలతో క్షీణించిన మానసిక పనితీరుగా గుర్తించడం జరిగింది’ అని సేపియన్ ల్యాబ్స్ డైరెక్టర్ శైలేందర్ స్వామినాథన్ అంటున్నారు.
యువతే ఎక్కువ..
మానసికంగా ప్రభావితమైన వారి సంఖ్య యువకులలో ఎక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 55 ఏళ్లు
అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు అంతర్జాతీయ కొలమానాలతో సమానంగా 102.4 స్కోర్ సాధించగా, 18 నుంచి 24 సంవత్సరాల మధ్య యువత సగటున 27 పాయింట్లు పైబడి మాత్రమే సాధించి ‘ఎండ్యూరింగ్’ విభాగంలో చోటు దక్కించుకుంది. సేపియన్ ల్యాబ్స్‌కు చెందిన ప్రధాన శాస్త్రవేత్త తారా త్యాగరాజన్ మాట్లాడుతూ.. ‘దాదాపు సగం మంది యువకులు బాధను, మనసును బలహీనపరిచే భావాలను కలిగి ఉన్నారు’ అని చెప్పారు. యువత మానసిక ఆరోగ్య సంక్షోభానికి కారణాలను సైతం నివేదిక కీలకంగా ప్రస్తావించింది.
పంచుకునే మనసులు లేక..
హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ పరిస్థితికి ముఖ్యంగా సామాజిక బంధాల విచ్ఛిన్నం ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది. వ్యక్తివాద మనస్తత్వాలు పెరగడం వల్ల కుటుంబాలు సన్నిహిత స్నేహాలు వంటి సంప్రదాయ పద్ధతులు క్షీణించాయి. పిల్లలతో గడపడం అనే విషయంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం వంటివి వీటికి జత కలిసి ఒంటరితనం పెరుగుదలకు ఆజ్యం పోసింది అని నివేదిక తేల్చింది.
ఊహ తెలిసేలోపే.. స్మార్ట్ ఫోన్ వినియోగం
చిన్న వయసు నుంచే స్మార్ట్ ఫోన్ వినియోగం అలవాటు కూడా ఈ పరిస్థితికి దోహదం చేస్తోంది. తగిన వయసు లేకుండా స్మార్ట్ ఫోన్ వినియోగించడం వల్ల విషాదం, నిరాశా నిస్పృహలు, ఉద్రేకం, ఆత్మహత్యా ధోరణులు పెట్రేగేందుకు అవకాశం ఇచ్చి వాస్తవ దూరమైన ప్రపంచంలోకి నెడుతోంది. చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్ వినియోగం నిద్రాభంగానికి, సైబర్ బెదిరింపులు, హానికరమైన కంటెంట్‌ను దగ్గర చేస్తుంది.
పర్యావరణ ప్రభావం..
మానసిక సమస్యలకు పర్యావరణ మార్పులు కూడా దోహదం చేస్తున్నాయి. ఆహారం నీటిలో ఇప్పుడు సర్వ సాధారణంగా కనిపించే పురుగు మందులు, భారీ లోహాలు మైక్రోప్లాస్టిక్‌లు–మెదడు అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు యుక్తవయస్సులో ఉన్నవారిలో తీవ్ర సమస్యలకు ఇది దోహదం చేస్తోందని నివేదిక నిర్ధారించింది.
రాంగ్ డైట్.. సైకలాజికల్ ఫైట్..
అతిగా అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్(యుపీఎఫ్) తీసుకునే వ్యక్తులు మానసిక క్షోభను కూడా ఎక్కువ అనుభవించే అవకాశం ఉంది. ‘యుపీఎఫ్ వినియోగం 15 సంవత్సరాలలో బాగా పెరిగింది. కొన్ని సందర్భాల్లో ఇది 30% వరకు మానసిక అనారోగ్యానికి కారణమవుతోందని మా డేటా సూచిస్తోంది.’ అని నివేదిక పేర్కొంది.