యూరప్‌లో శాంతి తక్షణావసరం | Sakshi Guest Column On Europe | Sakshi
Sakshi News home page

యూరప్‌లో శాంతి తక్షణావసరం

Published Tue, Jan 7 2025 2:30 AM | Last Updated on Tue, Jan 7 2025 4:16 AM

Sakshi Guest Column On Europe

అభిప్రాయం

ఒకప్పుడు ఉక్రెయిన్‌ తుది విజయం వరకూ మద్దతునిద్దామనే పశ్చిమ దేశాల ప్రజల అభిప్రాయం ఇప్పుడు క్రమేపీ తగ్గుతోంది. యూగోవ్‌ సర్వే సంస్థ తాజాగా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, స్వీడన్, డెన్మార్క్, యూకేలలో ప్రజాభి ప్రాయాన్ని సేకరించింది. ఈ ఏడు దేశాల ప్రజలు సంవత్సరం క్రితం ఇచ్చిన మద్దతుకు కట్టుబడి లేరు. 

ఉక్రెయిన్‌కు మద్దతునిచ్చే వారి సంఖ్య స్వీడన్‌లో 57 శాతం నుంచి 50 శాతానికి, యూకేలో 50 శాతం నుంచి 36 శాతానికి, డెన్మార్క్‌లో 51 శాతం నుంచి 40 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో శాంతి చర్చల ద్వారా ఉక్రెయిన్‌ సమస్యకు పరిష్కారం వెతకాలనే వారి సంఖ్య ఇటలీలో 45 శాతం నుంచి 55 శాతానికి, స్పెయిన్‌లో 38 నుంచి 46 శాతా నికి, ఫ్రాన్స్‌లో 35 నుంచి 43 శాతానికి, జర్మనీలో 38 నుంచి 45 శాతానికి పెరిగింది. 

జనవరి 20 నాడు అమెరికా అధ్యక్ష అధికార పగ్గాలు చేపట్టనున్న ట్రంప్‌ ఉక్రెయిన్‌కు మద్దతు ఉప సంహరించుకొనే అవకాశాలు ఉన్నాయని 62 శాతం జర్మనీ ప్రజలు, 60 శాతం స్పెయిన్‌ వాసులు, 56 శాతం బ్రిటన్‌ ప్రజలు, 52 శాతం ఫ్రెంచ్‌ జనాలు అభిప్రాయ పడ్తున్నారని యూగోవ్‌ వెల్లడించింది.

ఉక్రెయిన్‌ – రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమై మూడేళ్లు నిండనున్నాయి. ఆర్థిక ఆంక్షలతో రష్యాను అదుపులోకి తెచ్చుకోవచ్చునని రష్యాపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాల అంచనాలకు విరుద్ధంగా రష్యా చమురు వాణిజ్యంతో ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగానే ఉంచుకొంది. రష్యాపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలే ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. 

ఆయా దేశాల్లో ద్రవ్యోల్భణం, నిరుద్యోగం పెరుగుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ఫ్రాన్స్, జర్మనీ, యూకే, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ప్రభుత్వాలు పతనమైపోతు న్నాయి. డిసెంబర్‌ ప్రారంభంలో ఫ్రెంచ్‌ ప్రధాని మైకెల్‌ బార్నియర్‌ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో నెగ్గలేక కూలిపోయింది. 

జర్మన్‌ ఛాన్సలర్‌ షోల్జ్‌ తన ఆర్థిక మంత్రిని బర్తరఫ్‌ చేయటంతో 3 సంవత్సరాల సోషల్‌ డెమాక్రాట్స్‌–గ్రీన్స్‌–ఫ్రీ డెమాక్రటిక్‌ పార్టీల కూటమి ప్రభుత్వం పడిపోయింది. ఓక్స్‌ వాగెన్, ఆడీ వంటి అనేక కార్ల కంపెనీలు మూత పడుతున్నాయి. దీనికి తోడు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌కు జర్మనీ మద్దతు కూడా జర్మనీ ప్రజలు స్వాగతించటం లేదు.

బ్రిటన్‌లో 22 నెలలు ఏలిన కన్సర్వేటివ్‌  ప్రధాని రిషి సునాక్‌ రాజీనామా చేసి ఎన్నికలకు పిలుపునివ్వగా లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించింది. దక్షిణ కొరియాలో అధ్యక్షుడు యూన్‌ సుక్‌ అవినీతి ఊబిలో కూరుకుపోయి, నేషనల్‌ అసెంబ్లీ తీర్మానాలను తన వీటో ద్వారా నిరోధించటంతో జనాగ్రహానికి గురై రాజీనామా చేయక తప్పలేదు. పశ్చిమాసియాలో గాజాపై యుద్ధం చేయిస్తూ 50 వేల వరకూ సామాన్య ప్రజల్ని చంపిన ఇజ్రాయెల్‌కు మద్దతు పలికిన అమెరికా అధ్య క్షుడు జో బైడెన్‌ ట్రంప్‌ చేతిలో ఓటమి చెందారు. 

2023లో ఉక్రెయిన్‌ విషయంలో బైడెన్‌ తప్పుడు నిర్ణయం తీసుకొన్నారని అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్‌ బహిరంగంగానే ప్రకటించారు. సుదీర్ఘ కాలం పాటు యుద్ధం జరిగేలా చేసి... రష్యా, ఉక్రెయిన్‌ ప్రజలు ఒకరినొకరు చంపుకునేలా చూడటమే పశ్చిమ దేశాల లక్ష్యంగా ఉంది. 

అమెరికా ప్రత్యర్థి రష్యాను బలహీన పర్చటమే తమ ధ్యేయమని, అన్ని రంగాలలో నిర్వీర్యం చేస్తామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ఇప్ప టికే అనేకసార్లు ప్రకటించారు. రష్యాతో నాటో దేశాలు దౌత్య సంబంధాల్ని  తెగతెంపులు చేసుకొన్నాయి. రష్యా సంపదను కొల్లగొట్టి దేశాన్ని ముక్కలు ముక్కలు చేయటమే అమెరికా ధ్యేయం.

యుద్ధం ప్రారంభంలో శాంతి ఒప్పందాలకు ఉక్రె యిన్‌–రష్యాలు అంగీకరించాయని టర్కీ, ఇజ్రాయిల్‌ తెలిపాయి. రష్యా యుద్ధం విరమిస్తే, ఉక్రెయిన్‌ తటస్థ దేశంగా నాటో సభ్యత్వాన్ని కోరదనేది సారాంశం. అయితే  అప్పటి యూకే ప్రధాని జాన్సన్‌ ఆఘ మేఘా లపై కీవ్‌ వెళ్లి ఉక్రెయిన్‌ ఆధ్యక్షుడు జెలెన్‌స్కీని ఒప్పందానికి దూరంగా ఉంచగలిగాడు. 9 ఏళ్ల క్రితం జరిగిన మిన్‌స్కు ఒప్పందాన్ని పశ్చిమ దేశాలు ఎప్పుడూ గౌర వించలేదు. 

ఉక్రెయిన్‌ మిలిటరీ పరంగా బలం పుంజు కోటానికే మిన్‌స్కు ఒప్పందాన్ని ఎర వేశామని సాక్షాత్తు ఒకప్పటి జర్మనీ ఛాన్సలర్‌ మెర్కల్‌ ప్రకటించారు కూడా. ఫ్రాన్స్‌ కూడా ఈ ఒప్పందానికి కట్టుబడి లేమని ఒప్పుకొంది. నాటో దేశాలు యుద్ధానికే మొగ్గు చూపా యని టర్కీ విదేశాంగ మంత్రి, ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని కూడ తెలియజేశారు. లిండేగ్రాహం వంటి అమె రికా కాంగ్రెస్‌ సభ్యుడు ‘చివరి ఉక్రేనియన్‌’ వరకూ రష్యాతో పోరాటానికి బహిరంగ మద్దతు ఉంటుందని, ‘అమెరికా ప్రాణాలను పణంగా పెట్టకుండా ఉక్రెయి న్‌కు ఆయుధ సహాయం చేయటం అమెరికా ‘తెలివైన పెట్టుబడి’ అని అన్నారు.

ఉక్రెయిన్‌లో ఏ ప్రాంత ప్రజలు కూడా నిరంతర యుద్ధానికి మద్దతు పలకటం లేదు. ఒకప్పుడు ఉక్రెయిన్‌ నాయకుల విజయంపై ఉన్న ఆశలను నేడు క్రమేపీ వదులుకొంటున్నారు. తాజా సర్వేల్లో ఉక్రెయిన్‌ అధ్యక్షులు జెలెన్‌స్కీపై భ్రమల్ని ప్రజలు వదులుకుంటున్నారు. ఉక్రెయిన్‌ ఫ్రంట్‌లైన్‌లు కుప్పకూలిపోతున్నాయి. 

నాటో భౌగోళిక విస్తరణకు ఉక్రెయిన్‌ భారీ మూల్యం చెల్లిస్తున్నది. సంఘర్షణ ఎంత ఎక్కువ కాలం కొనసాగితే ఉక్రెయిన్‌ ప్రజలు మరిన్ని ప్రాణ నష్టాలతో, ఆర్థిక నష్టాలతో అంత ఎక్కువ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఈ స్పష్టతతో పశ్చిమ దేశాల వ్యూహం భవి ష్యత్తులో విఫలమవుతుంది. రష్యాపై ఉక్రెయిన్‌ శత్రు వైఖరిని విడిచిపెట్టినప్పుడు మాత్రమే యుద్ధం ముగు స్తుంది. రష్యా కూడా శాంతి మార్గాలు వెతకాలి.

బుడ్డిగ జమిందార్‌ 
వ్యాసకర్త అసోసియేట్‌ ప్రొఫెసర్,కేఎల్‌ యూనివర్సిటీ ‘ 98494 91969

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement