
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్
విశ్లేషణ
భారత ప్రభుత్వం సుంకాల విషయమై అమెరికాతో చర్చిస్తున్న పద్ధతిని కొందరు సమర్థిస్తుండగా, కొందరు విమర్శిస్తున్నారు. విలువైన అంశాలు రెండింటిలోనూ ఉన్నాయి. కానీ ఈ చర్చలన్నీ తక్షణ అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. అవి అవసరమే. అదే సమయంలో మరికొంత లోతుకు వెళ్లటం, దీర్ఘకాలిక దృష్టి తీసుకోవటం కూడా చేస్తే తప్ప ఇంత ముఖ్యమైన విషయమై సమగ్రమైన అవగాహన ఏర్పడదు.
ఇతర దేశాల నుంచి దిగుమతులపై తాము స్వల్పమైన సుంకాలు విధిస్తున్నామనీ, తమ ఎగుమతులపై మాత్రం వారు భారీ సుంకాలు వేస్తున్నారనీ, ఆ విధంగా తాము రెండు విధాలుగానూ నష్టపోతున్నామన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నమాట. కేవలం గణాంకాలకు పరిమితమైతే అది నిజమే. కానీ, అందులో అనేక మతలబులున్నాయి.
అమెరికాలో ఒకప్పుడు విస్తారంగా ఉండిన ఉత్పత్తుల రంగాన్ని కుదించి, పరిశ్రమలను ఇతర దేశాలకు తరలించింది అక్కడి ప్రభుత్వమే గదా? అసలు వివిధ అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య సంస్థలను ఉనికిలోకి తెచ్చి స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించిందే అమెరికా. ఒకవేళ 90 రోజుల వాయిదా కాలంలో చర్చల ద్వారా కొన్ని సర్దుబాట్లు జరిగినా కొంత నష్టం మిగిలే ఉంటుంది.
ఈ పరిణామాలన్నింటి ప్రభావంతో అమెరికా పట్ల ప్రపంచానికి ఇంత కాలం ఉండిన విశ్వాసం తగ్గుతుందనే సందేహం ఉంది. అది జరిగినపుడు ఇప్పటికే గల బహుళ ధ్రువ ప్రపంచ ధోరణులు మరింత బలపడగలవనే అభిప్రాయాలు ఎక్కువవుతున్నాయి.
నాలుగు ధోరణులు
ఇండియాతో అమెరికా వాణిజ్య లోటు 2024–25లో 41.18 బిలి యన్ డాలర్లు. మన దిగుమతులపై అమెరికా సుంకాల రేటు సగటున 2.7 శాతం. అమెరికా నుంచి దిగుమతులపై మన సుంకాల రేటు సగ టున 12 శాతం కాగా, కొన్ని సరుకులపై 48 శాతం వరకు ఉంది. ఈ లెక్కలను బట్టి అమెరికా అధ్యక్షుడు అన్ని దేశాలతో గల వాణిజ్య లోటులో 50 శాతం మేర సుంకాలు పెంచిన ప్రకారం భారత ఎగుమతులపై రేటును 26 శాతంగా ప్రకటించారు. ఏప్రిల్ 2న ఈ కొత్త రేట్లు ప్రకటించటానికి ముందే చేసిన హెచ్చరికలను బట్టి భారత ప్రభుత్వం అమెరికన్ మోటార్ సైకిళ్లు వగైరాపై సుంకాలు తగ్గించటం తెలిసిందే. అయినప్పటికీ కొత్త రేట్లు యథావిధిగా పెరిగాయి.
ఈ పరిస్థితుల దృష్ట్యా భారత్ ఏమి చేయాలన్నది ప్రశ్న. ప్రపంచ దేశాలు చేస్తున్నదేమిటని చూడగా నాలుగు ధోరణులు కనిపిస్తు న్నాయి. కొన్ని చిన్న ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా లొంగి పోతున్నాయి. అమెరికా నుంచి దిగుమతులపై సుంకాలు నూరు శాతం రద్దు చేస్తు న్నాయి. ఇందుకు ఒక ఉదాహరణ జింబాబ్వే.
కొన్ని సామరస్య ధోర ణితో ఇచ్చిపుచ్చుకునే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. జపాన్ అందు కొక ఉదాహరణ. కొన్ని ఎదురు సుంకాలతో ప్రతిఘటిస్తూ అమెరికా తగ్గితే తాము తగ్గుతామంటున్నాయి. కెనడా, యూరోపియన్ దేశాలు ఈ కోవలోకి వస్తాయి. చైనా ఒక్కటి భిన్నంగా కనిపిస్తున్నది. పోరాడు తాము తప్ప లొంగే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నది.
ఈ నాలుగింటిలో ఇండియా ప్రయోజనాలకు ఉపయోగపడ గలది ఏది? చైనా వలె పూర్తిగా ధిక్కరించటమన్నది అభిలషణీయం కాదు, కావాలనుకున్నా సాధ్యమయ్యేదీ కాదు. వారిది రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత దేశం కన్నా అయిదు రెట్లు పెద్దది.
క్రమంగా అమెరికాను మించిపోయి అగ్రస్థానానికి చేరాలన్నది చైనా లక్ష్యం. మన స్థితిగతులుగానీ, లక్ష్యాలుగానీ వీలైనంత అభివృద్ధి చెందటమే తప్ప చైనా వంటివి కావు. కనుక ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు అటువంటి వైఖరి తీసుకోవటమన్న ఆలోచనే అసందర్భం. ఇదంతా అర్థమయ్యో, కాకనో కొందరు భారత ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తున్నారు.
జపాన్ మార్గం
ఇక మిగిలినవి జపాన్, కెనడా ప్లస్ యూరోపియన్ మార్గాలు. ఈ రెండింటిలో రెండవది కూడా ఇండియాకు అనుకూలించగలది కాదు. అందుకు ఒక కారణం యూరోపియన్ దేశాలన్నీ ఒక బృందం వలె నిలిచి ఉన్నాయి. అది గాక సైనికంగా, భౌగోళిక వ్యూహాల రీత్యా అమెరికా, కెనడా, యూరప్‌ల సాన్నిహిత్యం భిన్నమైనది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నందువల్లనే అమెరికా ట్యారిఫ్‌లను వారు బలంగా ఎదుర్కొంటూ, ఆ దేశం దిగి రావలసిందేనని స్పష్టం చేస్తు న్నారు. ఇదంతా భారతదేశానికి సాధ్యమయ్యేది కాదు.
అందువల్ల స్థూలంగా జపాన్ నమూనా ఒక్కటే మిగులుతున్నది. దక్షిణ కొరియా, మెక్సికో మొదలైన వాటి వైఖరి కూడా ఇంచుమించు ఇదే విధంగా కనిపిస్తున్నది. ఈ పద్ధతి ఇంకా ఇదమిత్థంగా రూపు తీసుకోలేదు. చర్చలు జరిగే కొద్దీ ఇందుకొక రూపం రాగలదని భావించవచ్చు.
భారత్ స్థూలంగా జపాన్ తరహా వైఖరిని తీసుకుంటున్నట్లు కని పిస్తున్నది. ఇందులోనూ ఒక ఆకు తక్కువే. అమెరికాతో జపాన్‌కు గల వ్యూహాత్మక భాగస్వామ్యం వేరు. అందుకే ‘స్థూలంగా’ అనే మాటను ఉపయోగించటం. ఇవన్నీ చెప్పుకున్న తర్వాత, భారతదేశం గురించి మాట్లాడుకోవలసిన మౌలికమైన విషయాలు రెండున్నాయి. భారత అభివృద్ధి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? కొత్త అభివృద్ధి లక్ష్యాల సాధనకు అనుసరించవలసిన మార్గం ఏమిటని ప్రభుత్వం భావిస్తున్నది? సుంకాల యుద్ధంపై తీసుకోగల వైఖరికి ఈ ప్రశ్నలతో సంబంధం ఉంటుంది.
దేశ ప్రయోజనాలే ముఖ్యం!
ఆర్థికాభివృద్ధి రీత్యా ఇండియా ఇంకా వర్ధమాన దేశమే. అభివృద్ధి చెందుతున్నా, ఆ వేగం ఉండవలసినంతగా లేదు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే అంతర్గతంగా జరగవలసింది చాలా ఉండటంతో పాటు, అభివృద్ధి చెందిన దేశాల నుంచి, ఇంచు మించు తన స్థాయిలో గల వర్ధమాన దేశాల నుంచి, అవసరమైన వనరులు గల దేశాల నుంచి సహకారం అవసరం. అందుకోసం ఈ కూటమి, ఆ కూటమి అనే ఒకప్పటి రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వైపుల నుంచి సహకారం కోసం సమ సంబంధాలు పాటించాలి. దేశ ప్రయోజనాలే దేనికైనా గీటురాయి కావాలి. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులంటూ ఉండరు.
పరిస్థితులు, ఫిలాసఫీ రెండూ ఇవే. ఇదంతా ఇప్పుడు మనం సుంకాల సమస్యల సందర్భంలో కొత్తగా సూత్రీకరిస్తున్నది కాదు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ‘ది ఇండియా వే, స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్‌సర్టెన్ వరల్డ్’ (2020) పేరిట రాసిన పుస్తకంలో ఈ సూత్రీ కరణలన్నీ కనిపిస్తాయి. శీర్షిక దానికదే ఎంతో అర్థవంతమైనది. ‘మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా జీవించటమే వివేకం’ అనే తిరు వళ్ళువర్ బోధనతో ఆయన తన పుస్తకాన్ని ప్రారంభించారు.
బ్రిటిష్ పాలకులు వచ్చిపడుతుండగా చదరంగంలో మునిగి రాజ్యం పోగొట్టుకున్న బెంగాల్ నవాబుల ఉదంతంతో ‘షతరంజ్ కే ఖిలాడీ’ సినిమా తీసిన సత్యజిత్ రే హెచ్చరిక, అమెరికా బలహీనపడుతుండగా ముందుకు దూసుకుపోతున్న చైనాల గురించి చర్చిస్తూ, ‘ఇప్పుడు భారతదేశం తనను తాను నిర్వచించుకుంటుందా? లేక ఇంకో ప్రపంచమే నిర్వచిస్తుంటుందా?’ అని ప్రశ్నిస్తారు. స్వయంగా అమెరికా, చైనాలలో రాయబారిగా పనిచేసిన జైశంకర్ సూత్రీకర ణలు, రూపొందిస్తున్న విదేశాంగ విధానాలు ప్రస్తుత క్లిష్ట పరిణా మాలకు తగినవే.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు