
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లోనే మృతి చెందారన్న హమాస్
ఖాన్ యూనిస్: ఇజ్రాయెల్‌కు చెందిన నలుగురు బందీల మృతదేహాలను హమాస్ గురువారం విడుదల చేసింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగర సమీపంలో రెడ్ క్రాస్ సంస్థకు అందజేసింది. అనంతరం రెడ్‌క్రాస్ వాహనంలో ఉంచారు. ఆ పేటికల్లో షిరి బిబాస్(32), ఆమె ఇద్దరు పిల్లలు ఏరియల్ బిబాస్(4), కెఫిర్ బిబాస్, రిటైర్డ్ జర్నలిస్ట్ ఓడెడ్ లిఫ్ షిట్జ్‌గా గుర్తించారు. వీరందరూ హమాస్ 2023 అక్టోబర్ ఏడో తేదీన దాడిలో అపహరించిన వారు. అయితే ఈ నలుగురు గతేడాది నవంబర్‌లో ఇజ్రాయెల్ చేసిన దాడిలో మరణించారని హమాస్ తెలిపింది.
ఇజ్రాయెల్ క్రూరమైన నిరంతర బాంబు దాడుల వల్ల అపహరణకు గురైనవారందరినీ రక్షించలేకపోయామని హమాస్ తెలిపింది. చనిపోయినవారు... పిల్లల ప్రాణాలనూ లెక్కచేయని నాయకత్వ తీరుకు బలైపోయారని హమాస్ బాధితుల కుటుంబాలకు తెలిపింది. మృతదేహాల పేటికలు తమకు అందాయని ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది. మరణించినవారి వివరాలను ఇజ్రాయెల్ అధికారికంగా వెల్లడించలేదు.
అప్పగింత సమయంలో.. ఖాన్ యూనిస్ శివార్లలో వేలాది మంది గుమిగూడారు. శవపేటికలను ఉంచడానికి ఏర్పాటు చేసిన వేదికపై ముసుగులు ధరించిన సాయుధులు... ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును రక్త పిశాచిగా చిత్రీకరించిన పెద్ద బ్యానర్‌ను ప్రదర్శించారు. ఒక పెద్ద స్క్రీన్‌లో లిఫ్‌షిట్జ్, బిబాస్ కుటుంబం ఫొటోలను, వీడియోలను ప్రదర్శించారు. అత్యంత చిన్నవయస్కుడైన కెఫిర్.. బాట్‌మాన్ దుస్తులు ధరించి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో అందరినీ కదిలించింది.