
పాలక రిపబ్లికన్లలోనూ తగ్గిన సదభిప్రాయం
ప్యూ రీసెర్చ్ పోలింగ్‌లో వెల్లడి
వాషింగ్టన్: గాజా భూభాగంలో పాలస్తీనియన్లను పొట్టనబెట్టుకుంటూ, హమాస్ సాయుధులపై సమరభేరి మోగించిన ఇజ్రాయెల్‌కు అమెరికా పూర్తిస్థాయిలో ఆయుధ, ఆర్థికసాయం చేస్తుంటే మరోవైపు అమెరికన్లలో మాత్రం ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేక భావన రోజురోజుకూ పెరుగుతోంది. సంబంధిత వివరాలు ప్యూ రీసెర్చ్ పోల్‌లో వెల్లడయ్యాయి. 2022 మార్చిలో ఇజ్రాయెల్ పట్ల 42 శాతం మంది అమెరికన్లు వ్యతిరేకత చూపిస్తే ఇప్పుడా వ్యతిరేకత 53 శాతానికి పెరిగింది. మరోవైపు విపక్ష డెమొక్రాట్లలో ఏకంగా 69 శాతం మంది ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత కనబరిచారు.
2022 ఏడాదిలో రిపబ్లికన్ పార్టీ సభ్యుల్లో 27 శాతం మంది ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత చూపగా ఇప్పుడు వారి సంఖ్య మరింత పెరిగింది. 50 ఏళ్లలోపు వయస్సున్న రిపబ్లికన్లలో దాదాపు సగం మంది ఇజ్రాయెల్ వైఖరిపై ధ్వజమెత్తారు. 2022లో డెమొక్రాట్లలో 53 శాతం మంది ఇజ్రాయెల్ పట్ల విముఖత వ్యక్తంచేయగా ఇప్పుడా వ్యతిరేకంగా 69 శాతానికి చేరిందని వ్యూ రీసెర్చ్ పోల్ వెల్లడించింది. ఈవారం అమెరికాలో ట్రంప్‌తో భేటీ కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వాషింగ్టన్‌కు రావడానికి కొద్దిరోజుల ముందు ఈ సర్వే చేపట్టారు.
గాజాను స్వా«దీనం చేసుకోవడంపై...
గాజాను స్వా«దీనం చేసుకోవాలన్న ట్రంప్ ఆలోచనలను అమెరికన్లు ఇష్టపడటం లేదు. ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరించిన తీరుపై అమెరికన్లలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ట్రంప్ వైఖరి ఇజ్రాయెల్‌కు అత్యంత అనుకూలంగా ఉందని 31 శాతం మంది భావిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్‌తో ట్రంప్ సమదూరం పాటిస్తున్నారని 29 శాతం మంది చెప్పారు. అయితే పాలస్తీనియన్లకు అనుకూలంగా ట్రంప్ వ్యవహరిస్తున్నాడని కేవలం 3 శాతం మంది మాత్రమే చెప్పడం విశేషం.
ఒకసారి స్వా«దీనం చేసుకుంటానని, మరోసా రి స్వా«దీనం చేసుకోబోనని, మరోసారి సుందర పర్యాటక క్షేత్రంగా మారుస్తానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలనుద్దేశిస్తూ అసలు ట్రంప్ భవిష్యత్ ప్రణాళిక ఏమిటో అర్థంకావట్లేదని 37 శాతం మంది చెప్పారు. గాజా స్ట్రిప్‌ను తన ఆ«దీనంలోకి తీసుకోవాలనే తన మునుపటి ప్రణాళికను ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ ఆలోచనను మెజారిటీ అమెరికన్లు స్వాగతించలేదు.
62 శాతం మంది అమెరికన్లు గాజాను అమెరికా స్వా«దీనం చేసుకోవాలనే ఆలోచనను చెత్తపనిగా అభివర్ణించారు. స్వా«దీనం చేసుకోవాలనే ట్రంప్ నిర్ణయాన్ని 49% మంది తీవ్రంగా వ్యతిరేకించారు. పాలస్తీనా ను దేశంగా ప్రకటిస్తే బాగుంటుందని 46 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యవహారాలకు సంబంధించి నెతన్యాహు సరైన నిర్ణయాలే తీసుకుంటారన్న విశ్వాసం తమకు అస్సలు లేదని 52% మంది అమెరికన్లు చెప్పారు. అమెరికన్ యూదుల్లో 53% మంది సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు.
యూదు అమెరికన్ల భిన్న మనస్తత్వం
గత కొంతకాలంగా అమెరికన్ యూదులు ఇజ్రాయెల్ ధోరణిని బాగా తప్పుబడుతున్నారు. ఇజ్రాయెల్ న్యాయవ్యవస్థలో బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వం కల్గజేసుకోవడాన్ని అమెరికన్ యూదులు విబేధిస్తున్నారు. న్యాయనియామకాల్లో ఇజ్రాయెల్ ప్రభుత్వ జోక్యం అనవసరమని వాళ్లు చెబుతున్నారు. అయితే గాజాలో హమాస్‌తో యుద్ధం విషయానికి వచ్చేసరికి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి మెజారిటీ యూదు అమెరికన్లు మద్దతు పలుకుతున్నారు. ఏకంగా 73 శాతం మంది అమెరికన్ యూదులు ఇజ్రాయెల్ పట్ల సానుకూల దృక్పథం కనబరిచారు. ఇక క్రైస్తవుల్లో లెక్కిస్తే 53 శాతం మంది అమెరికన్ క్యాథలిక్‌లు ఇజ్రాయెల్‌కు మద్దతు పలకట్లేరు. శ్వేతవర్ణ ప్రొటెస్టాంట్లలో సైతం సగం మంది ఇజ్రాయెల్‌ను విమర్శిస్తున్నారు. అమెరికన్ ముస్లింలలో ఏకంగా 81 శాతం మంది ఇజ్రాయెల్ దండయాత్రను తీవ్రంగా తప్పుబట్టారు.