
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు స్తంభించినప్పటికీ, ఇరు దేశాల మధ్య మతపరమైన పర్యాటక యాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ తమ దేశంలో జరిగే వైశాఖీ ఉత్సవాలకు భారత్ నుంచి హాజరయ్యే 6,500 మందికి పైగా సిక్కు యాత్రికులకు వీసాలు జారీ చేసినట్లు తెలిపింది.
పాకిస్తాన్‌లో వైశాఖీ ఉత్సవాలు ఏప్రిల్ 10 నుండి 19 వరకూ జరగనున్నాయి. ఈ సందర్భంగా పాక్‌కు వచ్చే యాత్రికులు గురుద్వారా పంజా సాహిబ్, గురుద్వారా నన్కానా సాహిబ్, గురుద్వారా కర్తార్‌పూర్ సాహిబ్‌లను సందర్శించనున్నారు. తాజాగా పాకిస్తాన్ హై కమిషన్‌లోని ఛార్జ్ డి అఫైర్స్ సాద్ అహ్మద్ వరైచ్ మీడియాతో మాట్లాడుతూ ‘పాకిస్తాన్ ప్రభుత్వం అధిక సంఖ్యలో జారీ చేసిన వీసాలు ఇరు దేశాల ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి, సంస్కృతులు, మతాల మధ్య అవగాహనను ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయని, పాకిస్తాన్ ఇలాంటి పవిత్ర స్థలాల సందర్శనలను భవిష్యత్తులో కూడా సులభతరం చేస్తుంటుందని’ తెలిపారు. ఈ యాత్రలు 1974లో రూపొందిన ‘పాకిస్తాన్-ఇండియా ప్రోటోకాల్ ఆన్ విజిట్స్ టు రిలీజియస్ ష్రైన్స్’ ఒప్పందం ప్రకారం జరుగుతున్నాయి.
ఎవాక్యూఈ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ఈటీబీపీ) ప్రతినిధి సైఫుల్లా ఖోఖర్ మాట్లాడుతూ గడచిన 50 ఏళ్లలో ఈ ఒప్పందం ప్రకారం నిర్దేశించిన 3,000 వీసాల పరిమితిని మించి అదనపు వీసాలు జారీ చేయడం ఇదే మొదటిసారన్నారు. ఈటీపీబీ ఆధ్వర్యంలో వైశాఖీ ఉత్సవాల ప్రధాన ఘట్టం ఏప్రిల్ 14న నన్కానా సాహిబ్‌లోని గురుద్వారా జన్మస్థాన్‌లో జరగనుందని తెలిపారు. సిక్కులకు పాకిస్తాన్ రెండవ ఇల్లు లాంటిదని, తాము ఇక్కడికి వచ్చే అతిథులను హృదయపూర్వకంగా స్వాగతించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గతంలో వైశాఖీ ప్రధాన కార్యక్రమం హసన్ అబ్దాల్‌లోని గురుద్వారా పంజా సాహిబ్‌లో జరిగేది. అయితే ఈసారి యాత్రికుల సంఖ్య పెరగడం వల్ల నన్కానా సాహిబ్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
ఇది కూడా చదవండి: 26/11 మాస్టర్‌మైండ్ తహవ్వూర్ రానా రాక.. ఢిల్లీ, ముంబై జైళ్లలో ఏర్పాట్లు?