ట్రంప్‌ మార్క్‌ ప్రతీకారం.. భారత్‌కు స్వల్ప ఊరట | USA Donald Trump Announces Tariff Over All Countries, Says Mixed Bag, Not A Setback | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ మార్క్‌ ప్రతీకారం.. భారత్‌కు స్వల్ప ఊరట

Published Thu, Apr 3 2025 7:10 AM | Last Updated on Thu, Apr 3 2025 9:57 AM

USA Donald Trump Announces Tariff Over All Countries

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాను చెప్పినట్టుగానే ప్రపంచ దేశాలకు షాకిచ్చారు. ట్రంప్‌ టారిఫ్‌ల బాంబు పేల్చారు. విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్‌ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ప్రతీకార సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. 

ఇదే సమయంలో భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్‌ ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని చెబుతూనే భారత్‌ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదన్నారు. 52 శాతం సుంకాలను విధిస్తోందని ట్రంప్‌ అన్నారు. అయితే, పలు దేశాలపై ప్రతీకార సుంకాలను విధించిన ట్రంప్‌.. రష్యా, ఉత్తర కొరియాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ రెండు దేశాలపై ఎలాంటి సుంకాలు విధించలేదు. 

ఏప్రిల్‌ 2వ తేదీని అమెరికా ‘విముక్తి దినం’గా ప్రకటించిన ట్రంప్‌ బుధవారం వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడారు. వైట్‌హౌస్‌లోని రోజ్‌ గార్డెన్‌లో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ట్రంప్‌ మాట్లాడుతూ..‘ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది. అమెరికా వ్యాపారం ఈరోజు పునర్జన్మించినట్లు అయింది. అమెరికా మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తుండబోతుంది. సుంకాల పేరుతో అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారు. ఇక అది జరగదు. మాపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తాం. అమెరికాకు ఈ రోజు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది.

ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చింది. సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయి. విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తాం. అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయి. దీంతో అమెరికా స్వర్ణయుగమవుతుంది. దశాబ్దాలుగా వాణిజ్య అడ్డంకులను అమెరికా తొలగిస్తూ వచ్చింది. కానీ పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలను విధిస్తూ వచ్చాయి. పలు దేశాలు అన్యాయమైన నియమాలను అవలంభించాయి.

అమెరికాలో దిగుమతి అవుతున్న మోటారు సైకిళ్లపై కేవలం 2.4 శాతమే పన్నులు విధిస్తున్నారు. అదే థాయిలాండ్‌, ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ద్విచక్రవాహనాలపై 60 శాతం, భారత్‌ 70 శాతం, వియత్నాం 75 శాతం సుంకాలు విధిస్తున్నాయి. వాణిజ్య విషయానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు స్నేహితుడు సైతం శత్రువు కంటే ప్రమాదకరం. అందుకే అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై 25 శాతం సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి విధించనున్నాం. అమెరికాలో ఉత్పత్తులు తయారుచేసే కంపెనీలపై ఎలాంటి పన్నులు వసూలు చేయం.

అమెరికా ప్రతీకార సుంకాలు ఇలా..
భారత్‌: 26 శాతం
యూకే: 10 శాతం
ఆస్ట్రేలియా: 10 శాతం
కొలంబియా: 10 శాతం
చిలి: 10 శాతం
బ్రెజిల్‌: 10 శాతం
సింగపూర్‌: 10 శాతం
టర్కీ: 10 శాతం
ఇజ్రాయెల్: 17 శాతం
పిలిఫ్ఫీన్స్‌: 17 శాతం
ఈయూ: 20 శాతం
మలేషియా: 24 శాతం
జపాన్‌: 24 శాతం 
దక్షిణ కొరియా: 25 శాతం
పాకిస్థాన్‌: 29 శాతం 
దక్షిణాఫ్రికా: 30 శాతం
స్విట్జర్లాండ్‌: 31 శాతం
ఇండోనేషియా: 32 శాతం
తైవాన్‌: 32 శాతం
చైనా: 34 శాతం
థాయిలాండ్‌: 36 శాతం
బంగ్లాదేశ్‌ 37 శాతం
శ్రీలంక: 44 శాతం
కంబోడియా: 49 శాతం

ఈ కార్యక్రమానికి కేబినెట్‌ సభ్యులతో పాటు స్టీల్‌, ఆటోమొబైల్‌ కార్మికులను ట్రంప్‌ ఆహ్వానించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందన్నారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు. ఆయా దేశాలపై జాలితోనే ఇలా సగం సుంకాలు ప్రకటించినట్లు తెలిపారు. వీటిని రాయితీ టారిఫ్‌లుగా ట్రంప్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement