
రోమ్: ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా–ఇరాన్ మధ్య తదుపరి చర్చలు శనివారం రోమ్‌లో జరగనున్నాయి. ఇరాన్, ఇటలీ అధికారులు ఈ విషయాన్ని సోమవారం ధ్రువీకరించాయి. చర్చలకు మధ్యవర్తిగా ఉన్న ఒమన్ నుంచి అందిన వినతి మేరకు అంగీకరించినట్లు ఇటలీ ప్రధాని ఆంటోనియో టజనీ తెలిపారు.
ఒమన్ రాజధాని మస్కట్‌లో శనివారం రెండు దేశాల మధ్య మొదటి రౌండ్ చర్చలు జరగడం తెల్సిందే. కాగా, అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) చీఫ్ రఫేల్ మరియానో గ్రాస్సీ సోమవారం ఈ విషయమై ఒక ప్రకటన చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చించేందుకు బుధవారం టెహ్రాన్ వెళ్తున్నట్లు ప్రకటించారు. తమ పరిశీలకుల బృందాన్ని అణు మౌలిక వసతులను సందర్శించేందుకు వీలు కల్పించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరే అవకాశముందని సమాచారం.