
వడదెబ్బతో మహిళ మృతి
ధర్మారం: పత్తిపాక గ్రామానికి చెందిన చెక్కపల్లి లక్ష్మి (60) అనే మహిళ వడదెబ్బతో ఆదివారం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు రోజుల క్రితం వడదెబ్బతో అస్వస్థతకు గురి కాగా.. గ్రామంలోనే చికిత్స తీసుకుందన్నారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. మృతురాలికి భర్త అంజయ్యతోపాటు ముగ్గురు కుమారులున్నారు.
గుర్తుతెలియని వ్యక్తి..
చొప్పదండి: జ్యోతినగర్ సమీపంలోని వేబ్రిడ్జిపై గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం మృతిచెందాడు. వడదెబ్బ తగలడంతో స్పృహ తప్పి పడిపోయి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్థానికుల సాయంతో 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడిని గుర్తించినవారు 8712670766 నంబర్‌కు సమాచారమందించాలని ఎస్‌ఐ మామిడాల సుదర్శన్ తెలిపారు.
పెగడపల్లి ఎస్సై సస్పెన్షన్
జగిత్యాల క్రైమ్: పెగడపల్లి ఎస్సై రవికిరణ్‌ను సస్పెండ్ చేస్తూ ఆదివారం మల్టిజోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదు కాగా.. కేసు విచారణలో జాప్యం చేయడంతోపాటు నిర్లక్ష్యం వహించారని ఉన్నతాధికారులు నివేదిక సమర్పించారు. దీంతో రవికిరణ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఫొటోలు షేర్ చేస్తామని బెదిరింపులు
● నలుగురి అరెస్ట్
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన సందరగిరి రాకేశ్ అనే యువకుడి వ్యక్తిగత ఫొటోలు షేర్ చేస్తామని బెదిరించి అతడు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన ఇదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై దూలం పృథ్వీధర్‌గౌడ్ ఆదివారం తెలిపారు. ఆయన వివ రాల ప్రకారం.. సందరగిరి రాకేశ్ ఇటీవల అనుమానాస్పదంగా మృతిచెందాడు. అతడి మరణ వాంగ్మూలంలో రాసిన నలుగురు వ్యక్తులను పిలిచి విచారించారు. రాకేశ్ వ్యక్తిగత ఫొటోలు గూగుల్‌లో షేర్ ద్వారా నలుగురు వ్యక్తులు షేర్ చేసుకున్నారు. ఫొటోలు బయటపెడతామని బెది రించారు. తన వ్యక్తిగత ఫొటోలు బయటపెడితే పరువు పోతుందని భావించిన రాకేశ్.. మర్లపేట గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకున్నాడు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
మెడలోని పుస్తెల తాడు చోరీ
యైటింక్లయిన్‌కాలనీ: గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి యైటింక్లయిన్‌కాలనీ రాజీవ్‌నగర్ లంబాడితండాకు చెందిన ఇస్లావత్ బుల్లి మెడలోని పుస్తెల తాడు ఆదివారం తెల్లవారుజామున చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇస్లావత్ బుల్లి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ఆవరణలో నిద్రపోయింది. తెల్లవారుజామున నిద్ర లేచి చూసుకునేసరికి తన మెడలోని పుస్తెల తాడు కనిపించలేదు. ఇంటి చుట్టు పరిసరాల్లో వెతికినా దొరకలేదు. గుర్తుతెలియని వ్యక్తులు తన మెడ లోని రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడు దొంగిలించినట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
రుద్రంగి: వేసవి సెలవుల్లో బంధువుల ఇళ్లకు వెళ్లేవారు, వారి ఇళ్లో దొంగలు పడే అవకాశమున్నందున పోలీస్ సిబ్బందికి సమాచారమందించాలని ఎస్సై సిరిసిల్ల అశోక్ సూచించారు. మండల కేంద్రానికి చెందిన ఎల్ల దేవవ్వ అనే మహిళ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లొచ్చేసరికి దొంగలు పడి అర తులం బంగారం, రూ.5వేల నగదు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఎస్సై పరిశీలించి వివరాలు సేకరించారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
60 దేశీకోళ్లు చోరీ
మల్యాల: నూకపల్లి శివారులో నాటుకోళ్ల్ల షెడ్డు లోని 60 నాటుకోళ్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. రామన్నపేటకు చెందిన నర్సయ్య అనే వ్యక్తి నూకపల్లి వరద కాలువ శివారులోని తన షెడ్డులో దేశీకోళ్లు పెంచుతున్నారు. శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు షెడ్డులోని 60 దేశీకోళ్లను ఎత్తుకెళ్లినట్లు ఆదివారం గుర్తించిన నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వడదెబ్బతో మహిళ మృతి

వడదెబ్బతో మహిళ మృతి