
పోర్టు పనులు సకాలంలో పూర్తి చేస్తాం
మంత్రి జనార్దనరెడ్డి
చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం పరిసర ప్రాంతాల ప్రజల చిరకాల వాంఛ అయిన పోర్టు నిర్మాణాన్ని సకాలంలో పూర్తిచేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బి.సి.జనార్దనరెడ్డి అన్నారు. మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పోర్టు నిర్మాణ పనులను ఆయన సోమవారం పరిశీలించారు. పోర్టు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోర్టు మ్యాప్‌ను పరిశీలించిన అనంతరం మంత్రి జనార్దనరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 30 శాతం పోర్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. సకాలంలో పోర్టు నిర్మాణం పూర్తి చేసేలా కాంట్రాక్టర్లను ఆదేశించామన్నారు. అమరావతికి అతిసమీపంలో ఉన్నందున మచిలీపట్నం పోర్టు కీలకంగా మారనుందన్నారు.
త్వరితగతిన ఫిషింగ్ హార్బర్ పనులు
త్వరితగతిన గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ పనులను పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇస్తామని మంత్రి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, వంగలపూడి అనితతో కలిసి హార్బర్ పనులను జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం జనార్దనరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే దాదాపు 57 శాతం హార్బర్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. 2026 మార్చి నాటికి ఈ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో రెండోసారి కాలపరిమితి పొడి గించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.3,500 కోట్లతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేస్తున్నామన్నారు. గిలకలదిండి హార్బర్ నిర్మాణం పూర్తయ్యాక ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు మంత్రి కొల్లు రవీంద్ర కృషి చేస్తున్నారన్నారు. జూన్ 15 నాటికి బోట్లు జెట్టీకి వచ్చేలా చర్యలు చేపడ్తామని మంత్రి రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, ఎస్పీ జి.గంగాధరరావు, మారి టైం బోర్డు సీఈఓ ప్రవీణ్‌ఆదిత్య, ఆర్డీఓ కె.స్వాతి తదితరులు పాల్గొన్నారు.
మైరెన్ పోలీస్‌స్టేషన్ల ద్వారా నిఘా
మైరెన్ పోలీస్‌స్టేషన్ ద్వారా తీరప్రాంతాల్లో నిఘా పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. హార్బర్ పనులను పరిశీలించిన అనంతరం ఆమె మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 21 మైరెన్ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే మూడు మైరెన్ పోలీస్‌స్టేషన్లు ఉండటం ఎంతో ఉపయోగకరమని వివరించారు.