
ఏపీ ఎన్జీఓ నేతల కొవ్వొత్తుల ర్యాలీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పహల్గాం ఉగ్రవాద దాడిని ప్రతిఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డి.సత్యనారాయణరెడ్డి, కార్యదర్శి పి. రమేష్ కోరారు. అమాయకులైన పర్యాటకులపై దాడిచేసి ప్రాణాలు తీయడం అమానుషమన్నారు. ఉగ్రదాడిని ఖండిస్తూ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రదాడి దేశ ప్రజల హృదయాలను తీవ్రంగా కలచివేసిందన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకయిన భారతీయ ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు చేసిన ఇలాంటి దాడులను ప్రతిఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉగ్ర దాడిలో అసువులు బాసిన వారి కుటుంబాలకు ప్రగాఢ సాను భూతి తెలిపారు. దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న మానసిక క్షోభ మాటల్లో చెప్పలేనిదని, ఈ కష్టకాలంలో వారికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలిచి మనోధైర్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఏపీ ఎన్జీఓ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడి అమానవీయ చర్య అని, ముష్కరులు దాడికి తెగబడిన తీరును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఉగ్రవాదులను, వారిని ప్రోత్సహిస్తున్నవారిపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు పాల్పడకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ ప్రదర్శనలో ఏపీ ఎన్జీఓ నేతలు పలువురు పాల్గొన్నారు.