అయ్యో కొడుకులారా! కరెంట్‌ స్తంబాల కింద ‘కూలి’న బతుకులు | - | Sakshi
Sakshi News home page

అయ్యో కొడుకులారా! కరెంట్‌ స్తంబాల కింద ‘కూలి’న బతుకులు

Published Tue, Jul 4 2023 9:56 AM | Last Updated on Tue, Jul 4 2023 10:13 AM

- - Sakshi

మంచిర్యాల: వారిద్దరూ తోబుట్టువులు.. కష్టజీవులు.. కుటుంబానికి పెద్ద దిక్కులేకపోవడంతో ఏ పూటకాపూట కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సొంత ఊరిలో ‘ఉపాధి’ దొరక్క, కుటుంబాన్ని పస్తులుంచడం ఇష్టం లేక వారంతా 20 కిలో మీటర్ల దూరం కూలి పనులకు వెళ్తున్నారు. వచ్చిన కూలితో కుటుంబాన్ని పోషికుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సద్దిబువ్వ సిద్ధం చేసుకుని పనికి వెళ్లారు. ఇంతలో రోడ్డు ప్రమాదరూపంలో వారిని మృత్యువు కబళించింది.

నలిగిన బతుకులు
కుమురంభీం జిల్లా బెజ్జూర్‌ మండలంలోని ముంజంపల్లికి చెందిన బుర్రి వసంత్‌(26), బుర్రి అనిల్‌ (24) ఇద్దరు అన్నాతమ్ముళ్లు. గ్రామానికి చెందిన జంబుల చిలుకయ్య, తిరుపతి, రాకేష్‌, సుధాకర్‌తో కలిసి కౌటాలకు చెందిన విద్యుత్‌ కాంట్రాక్టర్‌ ఉప్పుల సత్తయ్య వద్ద కూలి పనికి వచ్చారు. వీరంతా కొంతకాలంగా విద్యుత్‌ స్తంభాల తరలింపు పనులకు వస్తున్నారు. ఈక్రమంలో సోమవారం వసంత్‌, అనిల్‌, చిలుకయ్య గుడ్లబోరిలో విద్యుత్‌ స్తంభాలను ట్రాక్టర్‌ ట్రాలీలో లోడ్‌ చేసుకుని అక్కడికి సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న పని ప్రదేశానికి బయలు దేరారు.

డ్రైవర్‌ చిలుకయ్య ట్రాక్టర్‌ నడుపుతుండగా పక్కన వసంత్‌, అనిల్‌ కూర్చున్నారు. వైగాం గ్రామానికి సమీపంలోకి రాగానే ట్రాక్టర్‌ అదుపుతప్పి ట్రాలీ తిరగబడింది. ఈ క్రమంలో చిలుకయ్య, వసంత్‌, అనిల్‌ ట్రాక్టర్‌ ఇంజన్‌ పక్కకు పడిపోయారు. వసంత్‌కు స్తంభాలు బలంగా ఢీకొనగా అనిల్‌ మీద రెండు స్తంభాలు పడ్డాయి. దీంతో సోదరులిద్దరూ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. డ్రైవర్‌ చిలుకయ్య తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం 108లో సిర్పూర్‌(టి) ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని కౌటాల సీఐ సాదిక్‌పాషా, ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాలను సిర్పూర్‌(టి) సామాజిక ఆస్పత్రికి తరలించారు.

అధికలోడే కారణమా?
విద్యుత్‌ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాలీలో పరిమితికి మించి 11 భారీ సిమెంట్‌ స్తంభాలతో పాటు ఇతర విద్యుత్‌ పరికరాలను తరలించడంతోనే ఘటన జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు.

ఆ కుటుంబానికి దిక్కెవరు?
బెజ్జూర్‌ మండలంలోని ముంజంపల్లి గ్రామానికి చెందిన బుర్రి నీలయ్య–హంసక్క దంపతులకు కుమారులు వసంత్‌, అనిల్‌, కూతురు వనిత ఉన్నారు. వీరి చిన్నతనంలోనే తండ్రి మృతి చెందాడు. తల్లి హంసక్క ముగ్గురిని పెంచి పెద్ద చేసింది. వసంత్‌కు ఆర్నెళ్లక్రితం వివాహమైంది. అనిల్‌ చదువుమానేసి అన్నతో కలిసి పనికి వెళ్తున్నాడు. కుమారులిద్దర్నీ ఒకేసారి ట్రాక్టర్‌ రూపంలో మృత్యువు కబళించడంతో ఆ ఇంటికి మగదిక్కు లేకుండా పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement