
‘‘సాధారణంగా ప్రతి సినిమా విషయంలో ఆ సినిమా ఫిల్మ్ మేకర్‌కి ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. కానీ నా కెరీర్‌లో నేను అతి తక్కువ అసంతృప్తితో తీసిన సినిమా ‘సారంగపాణి జాతకం’. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ప్రియదర్శి, రూపా కొడవాయూర్ జంటగా, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పిన సంగతులు...
→ ‘యశోద’ మూవీ తర్వాత సినిమా చేద్దామని శివలెంక కృష్ణప్రసాద్‌గారు అన్నప్పుడు ‘సారంగపాణి జాతకం’ కథ చెబితే, ఆయనకు నచ్చింది. ప్రియదర్శి చేసిన ‘మెయిల్, బలగం’ సినిమాలు, ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్ చూసి తనతో మంచి హ్యూమరస్ మూవీ చేయొచ్చనిపించింది. దర్శికి విషయం చెబితే, అంగీకరించాడు. ఈ సినిమాలో ప్రియదర్శి, ‘వెన్నెల’ కిశోర్ ఆటోమొబైల్స్ రంగంలో ఉద్యోగాలు చేస్తుంటారు. ఒకరు సేల్స్‌మేన్, మరొకరు సేల్స్ సర్వీసింగ్ కన్సల్టెంట్. వైవా హర్ష పాత్ర కూడా బాగుంటుంది.
→ జాతకాలను నమ్మే పాత్రలో దర్శి నటించాడు. నేను జాతకాలను నమ్ముతానా? అంటే... నా జీవితంలో జ్యోతిష్కులు చెప్పినవి కొన్ని జరిగాయి... మరికొన్ని జరగలేదు. నా 32 యేళ్ల వయసులో దర్శకుడిగా నా తొలి చిత్రం వస్తుందని ఓ జ్యోతిష్కుడు చెప్పాడు. అది జరిగింది. 2016లో మే నుంచి ఆగస్టు మధ్యలో ఓ ప్రమాదం జరుగుతుందని మరో జ్యోతిష్కుడు 2015లోనే హెచ్చరించాడు. నిజంగానే 2016 జూలైలో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అలానే జ్యోతిష్కులు చెప్పినవాటిలో జరగనవీ ఉన్నాయి.
→ ఈ సినిమాలో నేను జాతకాన్ని ప్రశ్నించలేదు. ఏ నమ్మకాన్ని అయినా మీరు నమ్ముకోవచ్చు. అది దేవుడు కావొచ్చు.. వాస్తు కావొచ్చు. జాతకం కావొచ్చు. కానీ మామూలు నమ్మకం ఓ మనిషిని బలవంతుడ్ని చేస్తే, మూఢనమ్మకం బలహీనుడిని చేస్తుంది. అప్పుడు మనిషి తన జీవితంతో పాటు తన చుట్టూ ఉన్నవారి జీవితాలనూ అస్తవ్యస్తం చేస్తాడు. అప్పుడు ఎంత గందరగోళం ఏర్పడుతుందనే విషయాన్ని ఈ సినిమాలో హాస్యాస్పదంగా చూపించాం. నమ్మకం మనకు బలాన్నిచ్చే విధంగా ఉండాలి కానీ పిచ్చోడ్ని చేయకూడదు? ఈ సినిమాతో ఇదే చెప్పాలనుకున్నాను.
→ ఇక ఓటీటీల్లో సినిమాలు వెంటనే రిలీజ్ కాకుండా దర్శక–నిర్మాతలు–హీరోలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆడియన్స్‌ను థియేటర్స్ తీసుకురావడం మరింత కష్టమైపోతుంది. అలా అని ఆడియన్స్ థియేటర్స్‌కు రావడం లేదని కాదు. మార్చి 14న పదో తరగతి ఎగ్జామ్స్ టైమ్‌లో ‘కోర్ట్’ సినిమాను విడుదల చేస్తే బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఎమెషనల్ ఎక్స్‌పీరియన్స్‌ని కోరుకుంటున్నారు.
→ వాల్మికీ రామాయణం ఆధారంగా యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా ‘జఠాయు’ కథ ఉంది. భవిష్యత్‌లో ఈ కథతో సినిమా చేస్తాను.