
ఇటీవలి కాలంలో బాలీవుడ్, టాలీవుడ్‌ల మధ్య సంబంధాలు ఇంతింతై వటుడింతై అన్నట్టు అల్లుకుపోతున్నాయి.గతంలో ఎన్నడూ లేనంతగా బాలీవుడ్ తెలుగు సినిమా పరిశ్రమపై ప్రేమను కురిపిస్తోంది. రెండు చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు నిర్మాణం నుంచి నటన దాకా భాగం పంచుకుంటున్నారు. అదే క్రమంలో తాజాగా హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీయార్‌లు కలిసి వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఓ రకంగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రమే దీనికి కారణంగా చెప్పొచ్చు. తన నటన ద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగానూ పేరు సాధించిన జూనియర్ ఎన్టీయార్..క్రేజ్‌ను వాడుకోవడానికే వార్ 2 చిత్ర నిర్మాతలు హృతిక్‌తో ఎన్టీయార్ ని కలిపి అరుదైన కాంబోని ప్లాన్ చేశారనుకోవచ్చు. ఈ నేపధ్యంలో బాలీవుడ్‌లో ఎన్టీయార్ హవా మొదలయే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్ మల్టీస్టారర్‌లో నటించిన రామ్ చరణ్ గతంలోనే స్ట్రెయిట్ హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో తన ముద్ర వేద్దామని ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నం బెడిసికొట్టి.. ఇక ఆపై ఎప్పుడూ బాలీవుడ్‌లో కాలు మోపలేదు. అయితే ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రామ్‌చరణ్ కు కూడా జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో.. బాలీవుడ్‌కు ఆప్తుడిగా మారాడు.
ఈ నేపధ్యంలో హృతిక్ రోషన్ మాజీ భార్య ఇంటీరియర్ డిజైనర్ అయిన సుస్సానే ఖాన్ ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో చార్‌కోల్ పేరిట ఓ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. తాజాగా టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఆ స్టోర్‌ని సతీ సమేతంగా సందర్శించారు. దీంతో సుస్సానే ఖాన్ సంతోషాన్ని పట్టలేకపోయారు. రామ్‌చరణ్, ఉపాసన తమ స్టోర్‌కి వచ్చి మాకు అత్యంత అపురూపమైన ప్రత్యేకమైన అనుభూతిని అందించినందుకు ధన్యవాదాలు అంటూ ఆమె పోస్ట్ చేశారు. ఆమె సోదరుడు జాయెద్ ఖాన్ కూడా తమ సోదరి స్టోర్‌ను గ్లోబల్ సూపర్ స్టార్ అంతేకాక అద్భుతమైన వ్యక్తి అయిన రామ్‌చరణ్ సందర్శించడం ఎంతో సంతోషం కలిగిస్తోందంటూ తన స్పందన వ్యక్తం చేశాడు.
హృతిక్ రోషన్‌తో పెళ్లి బంధం విఛ్చిన్నమైనప్పటికీ సుస్సానే ఖాన్ వ్యక్తిగతంగా ఎంచుకున్న కెరీర్‌లో రాణిస్తోంది. అంతేకాకుండా ఆమె తన మాజీ భర్తతో ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఆమె హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన స్టోర్‌ను హృతిక్ సైతం సందర్శించడం ఆమె బిజినెస్‌కు మద్ధతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. వార్2లో హృతిక్ సహనటుడైన ఎన్టీయార్ ఇప్పటికీ తమ సిటీలోనే ఉన్న సుస్సానే స్టోర్‌ను సందర్శించనప్పటికీ, రామ్ చరణ్ మాత్రం ఈ విషయంలో ముందుండడం ఆసక్తి కలిగిస్తోంది.