
సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో మార్షల్ ఆర్ట్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇందులో పవన్ కల్యాణ్, దళపతి విజయ్ ఇద్దరూ కూడా ఒకే చోట శిక్షణ పొందారని మీకు తెలుసా..? తమిళనాడుకు చెందిన మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు షిహాన్ హుస్సేని (60) వద్ద వారు శిక్షణ తీసుకున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడంతో చిత్ర పరిశ్రమలో వారికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఈ స్టార్ హీరోలకు విద్య నేర్పించిన గురువు అనారోగ్యం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. సాయం కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తమిళ ఛానల్ గలాట్టాకు షిహాన్ హుస్సేని ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన శిష్యులు అయిన పవన్ కల్యాణ్, విజయ్‌లను ఆయన ఒక అభ్యర్థన కూడా చేశారు.

మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు షిహాన్ హుస్సేని బ్లడ్ క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నాడు. అందుకోసం చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం తను పడుతున్న ఇబ్బందుల గురించి ఇలా పంచుకున్నాడు. తన పూర్వ విద్యార్థులు విజయ్, పవన్ కల్యాణ్‌లకు అభ్యర్థన చేశారు. 'ప్రతి రోజు క్యాన్సర్‌పై నేనొక పోరాటం చేస్తున్నాను. కానీ, కరాటే మనిషిని కాబట్టి ఇవన్నీ నాకు అలవాటే.. క్యాన్సర్ కూడా కరాటే నుంచి నన్ను దూరంగా ఉంచనివ్వలేదు. మార్షల్ ఆర్ట్స్‌కు ఉన్న గొప్పతనం ఇదే..' అని హుస్సేని అన్నారు, ప్రతిరోజూ తనకు రెండు యూనిట్ల రక్తం అవసరం అవుతుందని ఆయన పంచుకున్నారు. ట్రీట్‌మెంట్‌కు అధికమొత్తంలో ఖర్చు అవుతుందని వాపోయారు. 'నేను ఇలాగే కొనసాగలేనని నాకు తెలుసు. నాకు దేవాలయం లాంటి నా శిక్షణా కేంద్రాన్ని అమ్ముతున్నాను.' అని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే, షిహాన్ హుస్సేని తన పూర్వ విద్యార్థి పవన్ కల్యాణ్ ఆ శిక్షణా కేంద్రాన్ని కొనమని కోరారు. ఈ క్రమంలో పవన్‌తో కొన్ని విషయాలను పంచుకున్నారు ' నా వద్ద శిక్షణ తీసుకుంటున్న సమయంలో అతనికి పవన్ అని పేరు పెట్టాను. ఈ మాటలు అతని చెవులకు చేరితే అతను తప్పకుండా స్పందిస్తాడని తెలుసు. అతను ఈ మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రాన్ని కొనుగోలు చేసి భవిష్యత్ తరాల కోసం నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. అతను ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి అని నాకు తెలుసు. కానీ, అతను నా దగ్గర శిక్షణ పొందిన రోజులు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. శిక్షణా కేంద్రాన్ని శుభ్రం చేయడమే కాదు.. ప్రతిరోజు నాకు టీ అందించే వాడు కూడా.. మార్షల్ ఆర్ట్స్ ను దేశవ్యాప్తంగా విస్తరింపచేయాలని ఇద్దరమూ మాట్లాడుకునే వాళ్లం. ఇప్పుడు దానిని పవన్ పూర్తి చేస్తాడని ఆశిస్తున్నాను.' అని హుస్సేని అన్నారు. ఈ శిక్షణ కేంద్రాన్ని వాణిజ్య సముదాయంగా లేదా నివాస అపార్ట్‌మెంట్‌గా మార్చే వ్యక్తికి అమ్మే బదులు, ఇది తన వారసత్వాన్ని సజీవంగా ఉంచడంలో సహాయపడుతుందని ఆయన నమ్మారు.

నటుడు విజయ్ కోసం కూడా హుస్సేని ఒక అభ్యర్థన చేశాడు. ఆసక్తికరంగా, పవన్ కల్యాణ్ నటించిన 'తమ్ముడు' చిత్రాన్ని తమిళ్‌లో బద్రి పేరుతో విజయ్ రీమేక్ చేశారు. అందులో విజయ్‌కు శిక్షణ ఇచ్చే మాస్టర్‌గా హుస్సేని నటించారు. అలా వీరిద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంది. విజయ్ గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చారు. 'ఒలింపిక్ పతక విజేతలను తమిళనాడులో తయారు చేయాలని విజయ్ కల కనేవాడు. క్రీడల పరంగా దేశంలో తమిళనాడుకు ప్రత్యేక గుర్తింపు రావాలని ఒక ఎజెండాను కూడా సిద్ధం చేసుకున్నాడు. ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ మాత్రమే కాకుండా, విలువిద్యలో కూడా శిక్షణ ఇచ్చే వాళ్లం. తాను అనుకున్న ఒలింపిక్ కలను విజయ్ నిలబెట్టుకోవాలని' హుస్సేని తన అభ్యర్థనగా పంచుకున్నారు. తమిళనాడులోని ప్రతి ఇంట్లో ఒక విలువిద్య ఔత్సాహికుడు ఉండేలా చూడాలని విజయ్‌ను కోరుతున్నానని ఆయన అన్నారు. ఒలింపిక్స్ సహా వివిధ ఈవెంట్లలో రాష్ట్రం, దేశానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఉండేలా చూడాలని తాను విజయ్‌ను అభ్యర్థిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. షిహాన్ హుస్సేని కూడా పలు సినిమాల్లో నటించారు.