
'ఎల్ 2: ఎంపురాన్' (L2 Empuraan) వివాదంపై మోహన్‌లాల్ (Mohanlal) ఇప్పటికే స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం తరఫున క్షమాపణలు చెబుతూ ఆయన ఒక పోస్టు కూడా చేశారు. తాజాగా చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తల్లి మల్లిక కూడా ఈ గొడవపై రియాక్ట్ అయ్యారు. లూసిఫర్ సినిమా విషయంలో కేవలం తన కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కొందరు దూషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
లూసిఫర్2 సినిమా విషయంలో తన కుమారుడిని కించపరిచేలా తప్పుడు కథనాలు రావడాన్ని మల్లిక తప్పుబట్టారు. ఈ వివాదంపై మొదట తాను రియాక్ట్ కాకూడదని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పారు. కానీ, ఒక తల్లిగా తన కుమారుడి కోసం రియాక్ట్ కావాల్సి వస్తుందని ఆమె ఇలా అన్నారు. 'ఎల్ 2: ఎంపురాన్' తెర వెనుక జరుగుతున్న విషయాలన్ని నాకు తెలుసు. కానీ, నా కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కథనాలు క్రియేట్ చేస్తున్నారు. నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు. మోహన్‌లాల్, చిత్ర నిర్మాతలు ఎవరూ కూడా పృథ్వీరాజ్ మోసం చేసినట్లు చెప్పలేదు. మోహన్‌లాల్ నా సోదరుడితో సమానం. నా కుమారుడిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం కూడా ఆయనకు తెలియకుండానే కొందరు చేస్తున్నారు. చాలామంది కుట్రలు పన్ని నా కుమారుడిని బలిపశువును చేస్తున్నారు.
నా కుమారుడు పృథ్వీరాజ్ ఎవరినీ మోసం చేయడని బలంగా చెబుతున్నాను. ఈ మూవీ వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చాయంటే అందులో భాగమైన వారందరికీ బాధ్యత ఉంటుందని తెలుసుకోవాలి. కేవలం ఒక్కరి మీద మాత్రమే నిందలు వేయకూడదు. సినిమా కథను అందరూ చదివే కదా అందరూ ఆమోదించారు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రచయిత కూడా ఎల్లప్పుడు పక్కనే ఉన్నారు. ఇబ్బంది ఉంటే ఆయనే మార్పులు చేసేవారు. సినిమా విడుదలయ్యాక కేవలం పృథ్వీరాజ్‌ను మాత్రమే తప్పుపడుతున్నారు. పూర్తి విషయాలు తెలుసుకోకుండా కొందరు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు.
మోహన్‌లాల్‌కు తెలియకుండా కొన్ని సీన్లు ఈ మూవీలో కలిపారంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. సినిమా పూర్తి అయిన తర్వాత అందరూ చూసిన తర్వాతే విడుదల చేశారు. అందరి ఆమోదంతోనే మీ వద్దకు మూవీ వచ్చిందని గ్రహించండి. నా కుమారుడు ఎప్పటికీ ఎవరి వ్యక్తిగత విశ్వాసాల జోలికి వెళ్లడు.' అని మల్లిక చెప్పుకొచ్చారు.
2002 సమయంలో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల నేపథ్యంలోని కొన్ని సీన్లు ఈ సినిమాలో చూపించారని కొందరు తప్పపట్టారు. ఆ సమయంలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు అత్యంత కీరాతకంగా హత్య చేసి ఫైనల్‌గా అతనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారని చూపించటం ఒక వర్గం వారికి నచ్చలేదు. దీంతో ఈ చిత్రంపై చాలా విమర్శలు వచ్చాయి.