
మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా కాపీరైట్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు (Dil Raju)కు ఇచ్చిన మధ్యంతర రక్షణను సుప్రీంకోర్టు కొనసాగించింది. మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా కాపీరైట్ వివాదానికి సంబంధించి నిర్మాత వి.వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలంటూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఇప్పటికే మధ్యంతర రక్షణ ఇచ్చింది. అంతేగాక తదుపరి విచారణ వరకు దిల్ రాజుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. శుక్రవారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా మధ్యంతర రక్షణను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏమిటీ కేసు?
‘నా మనసు నిన్ను కోరే నవల‘ ఆధారంగా ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ అనే సినిమా తీశారంటూ రచయిత్రి ముమ్ముడి శ్యామలాదేవి 2017లో దిల్ రాజుపై కేసు పెట్టారు. దీంతో మాదాపూర్ పోలీసులు నిర్మాత దిల్ రాజుపై కాపీ రైట్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జరిగింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న సిటీ సివిల్ కోర్టు, సాక్ష్యాలను పరిశీలించి దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలని 2019లో ఆదేశించింది.
మధ్యంతర రక్షణ
ఈ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ దిల్‌రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించగా జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. దిల్ రాజుపై చర్యల విషయంలో గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను కొనసాగించిన జస్టిస్ జె.బి.పార్ధీవాలా ధర్మాసనం, తదుపరి విచారణను వాయిదా వేస్తూ.. అప్పటి వరకు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.
చదవండి: ఆపరేషన్ అనంతరం వెకేషన్‌లో యాంకర్ రష్మీ.. దేవుడిలాగే చేస్తాడేమో!