
మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా కేసులో ట్రయల్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
రెండు వారాల పాటు విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా కాపీరైట్ వివాదానికి సంబంధించి దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలంటూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు రెండు వారాల పాటు స్టే విధించింది. అంతేకాక తదుపరి విచారణ వరకు దిల్ రాజుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
‘నా మనసు నిన్ను కోరే నవల‘ఆధారంగా ‘మిస్టర్ పర్‌ఫెక్ట్‘అనే సినిమా తీశారంటూ రచయిత్రి ముమ్ముడి శ్యామలాదేవి 2017లో దిల్ రాజుపై కేసు పెట్టారు. దీంతో మాదాపూర్ పోలీసులు నిర్మాత దిల్ రాజుపై కాపీ రైట్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జరిగింది. విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న సిటీ సివిల్ కో ర్టు.. సాక్ష్యాలను పరిశీలించి 2019లో దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
అయితే ఈ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ దిల్ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించగా జస్టిస్ జె.బి. పార్ధీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వాద నలు విన్న ధర్మాసనం తదుపరి విచార ణను రెండు వారాలపాటు వాయిదా వేసింది. అప్పటి వరకు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.
మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా విషయానికొస్తే.. ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ, ప్రకాశ్‌రాజ్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రం 2011లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దశరథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment