
సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మధ్య కొన్నాళ్ల పాటు రాజకీయ వైర్యం కొనసాగిన సంగతి తెలిసిందే. 1996లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల సమయంలో రజనీకాంత్, జయలలిత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తే, దేవుడు కూడా తమిళనాడును రక్షించలేడు" అని ఆయన చేసిన ప్రకటన రాజకీయ రంగంలో సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యలు ఆ ఎన్నికల్లో జయలలిత అధికారం కోల్పోవడానికి ఒక కారణంగా నిలిచాయి. తాజాగా ఈ ‘రాజకీయ వివాదం’పై రజనీకాంత్ స్పందించారు. జయలలితను తీవ్రంగా వ్యతిరేకించడానికి గల కారణం ఏంటో ఆయన వివరిస్తూ.. మాజీ మంత్రి వీరప్పన్ పట్ల జయలలిత వ్యవహరించిన తీరే.. తనను వ్యతిరేకంగా మాట్లాడేలా చేసిందని చెప్పారు.
వీరప్పన్ పదవి పోయింది
సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు ఆర్.ఎం. వీరప్పన్, రజనీకాంత్ మధ్య మంచి స్నేహబంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. వీరప్పన్ సత్య మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన ‘బాషా’ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా 100 రోజుల వేడుకలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల కారణంగా వీరప్పన్ మంత్రి పదవి కోల్పోవలసి వచ్చిందట. ఈ వేడుకల్లో రజనీకాంత్ మాట్లాడుతూ.. తమిళనాడులో వారసత్య రాజకీయాల కారణంగా బాంబు సంస్కృతి పెరిగిపోయిందని.. రాష్ట్రం ఓ స్మశానంలా మారిందని అన్నారు. రజనీ వాఖ్యలు జయలలిత కోపానికి కారణం అయ్యాయట. దీంతో మంత్రిగా ఉన్న వీరప్పన్‌ని పదవి నుంచి తొలగించారట. జయలలితపై వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇదే ప్రధాన కారణం అని రజనీ అన్నారు.
వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని చెప్పారు
‘నేను జయలలితకు వ్యతిరేకంగా మాట్లాడటం వెనుక వ్యక్తిగత కారణాలు ఏమీ లేవు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం, ఆ రోజుల్లో పరిస్థితులను బట్టి అలా మాట్లాడాను. అయితే నా స్పీచ్ కారణంగా వీరప్పన్ పదవి పోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. మరుసటి రోజు ఫోన్ చేసి మాట్లాడాను. జయలలితతోనూ మాట్లాడతానని చెప్పాను. అయితే వీరప్పన్ మాత్రం దానికి అంగీకరించలేదు. ‘నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దను. నాకు ఏ పదవి అవసరం లేదు’ అని చెప్పారు. ఆయన ఈ విషయాన్ని లైట్ తీసుకున్నా.. నేను చాలా బాధపడ్డాను. జయలలితను తీవ్రంగా వ్యతిరేకించడానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి’ అని రజనీకాంత్ అన్నారు. వీరప్పన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ‘ఆర్‌వీఎం: ది కింగ్‌మేకర్’ డాక్యుమెంటరీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీకాంత్ ఈ వివాదం గురించి స్పందించాడు.