
గత ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’.. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇలా వరుస సంక్రాంతి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, వచ్చే ఏడాది కూడా సంక్రాంతికి వచ్చి, హ్యాట్రిక్ హిట్‌తో అలరిస్తానంటున్న నటి మీనాక్షి చౌదరీ చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.. ఇంకేందుకు ఆలస్యం చదివేయండి.
పెద్ద పెద్ద స్టార్స్‌తో చేసిన సినిమాలు కొంత నిరాశపరచిన మాట నిజమే! కొందరు వాటి ఫ్లాప్స్‌కి నన్ను బాధ్యురాలిని చేస్తూ కామెంట్స్ చేశారు. ఫ్లాప్‌కి బాధపడను, ఎందుకంటే మన పని మాత్రమే మనల్ని ముందుకి తీసుకెళ్తుంది. తెలుగులో నా ఫస్ట్ పిక్చర్ ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ వర్కవుట్ కాకపోయినా.. ఖిలాడీ సినిమాలో ఛాన్స్ రావడానికి అదే కారణం!
లక్కీ భాస్కర్ సినిమాతో నా లక్ మారిందని చాలామంది అంటున్నారు. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. కానీ.. ఇక ముందు పిల్లల తల్లి పాత్ర వస్తే నో చెప్పేస్తాను. నేను పంజాబీ అమ్మాయిని. మా నాన్న బీఆర్ చౌదరి ఆర్మీలో కర్నల్. ఆయన క్రమశిక్షణకి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. నన్ను తరచు తిడుతుండే వారు. ఇప్పుడు షూటింగ్‌కి అందరి కన్నా ముందు వచ్చి కూర్చోవడానికి ఆయనే కారణం. నువ్వు కొంచెం లేట్‌గా రావచ్చు కదా అంటారు యూనిట్ వాళ్లు.
∙చిన్నప్పుడు నేను చాలా ఇంట్రావర్ట్‌ని. కాలేజీలోకి వచ్చేటప్పటికే, నా ఎత్తు 6.2. దీంతో, అమ్మాయిలు కూడా నాతో కలిసి నడవటానికి, మాట్లాడటానికి ఇష్టపడే వాళ్లు కాదు. రకరకాల కామెంట్స్ చేసేవారు. చాలా బాధగా అనిపించేది. మా నాన్నకి చెప్పినా నీ సమస్యలు నువ్వే సాల్వ్ చేసుకోవాలి అనే వారు. బుక్స్ విపరీతంగా చదివేదాన్ని. అవే నా ఫ్రెండ్స్. అందాల పోటీల్లో, స్పోర్ట్స్ కాంపిటీషన్‌లో పాల్గొనడానికి నలుగురు కలుస్తారనేదే కారణం. నేను బ్యాడ్మింటన్, స్విమ్మింగ్‌లో ఛాంపియన్‌ని. మయాన్మార్‌లో జరిగిన అందాల పోటీల్లో నేను ఫస్ట్ రన్నర్‌గా వచ్చాను. ఈ మధ్య మయాన్మార్ లో భూకంపం వచ్చినప్పుడు నా మనసు కలచివేసినట్లయింది.
∙సీనియర్ హీరోలతో నటించడంలో నాకెలాంటి ప్రాబ్లెమ్స్ లేవు. అదో జోనర్‌గా భావిస్తాను. వెంకటేష్‌గారితో సంక్రాంతికి వస్తున్నాం చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిగారితో విశ్వంభర చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. నా మీద రూమర్స్ వచ్చినప్పుడు కోపం వస్తుంది. నేను సోషల్ మీడియాలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఏదన్నా ఉంటే నేనే అనౌన్స్ చేస్తాను. పంజాబీ అమ్మాయిని అయినప్పటికీ.. సౌత్ ఇండియన్ కల్చర్ బాగా నచ్చుతుంది. చీరలు కట్టుకోవడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. నేను డెంటిస్ట్‌ని. ఎవరిని అయినా ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు వెంటనే వాళ్ల దంతాలనే గమనిస్తుంటాను. నిజానికి డెంటిస్ట్‌గా ప్రాక్టీసు మొదలు పెట్టాను. కాని, హీరోయిన్‌గా బిజీ కావడంతో సాధ్యపడలేదని అంటోంది మీనాక్షి చౌదరి.