
మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) ఇటీవలే లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో అభిమానులను అలరించారు. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందే వివాదానికి దారి తీయడంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విషయంలో తీవ్రంగా నిరాశపర్చింది. ఈ నేపథ్యంలో హీరో విశ్వక్ సేన్ తాజాగా ఓ లేఖ విడుదల చేశారు. అభిమానులు ఆశించిన స్థాయిలో సినిమాలు చేయలేకపోయానని ట్విటర్ వేదికగా వెల్లడించారు.
విశ్వక్ సేన్ తన లేఖలో రాస్తూ..'అందరికీ నమస్కారం.. ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శలను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణానికి మద్దతిచ్చిన నా అభిమానులకు.. నాకు ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే. కానీ.. ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నా. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్.. మాస్ ఏదైనా సరే అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే.. నన్ను విమర్శించే హక్కు మీకు ఉంది. ఎందుకంటే, నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరే' అని రాసుకొచ్చారు.
'అంతేకాకుండా నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు.. నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నా. అంతే కాకుండా, నా మీద విశ్వాసం ఉంచిన నిర్మాతలు, పంపిణీదారులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే నా కథానాయకులు, దర్శకులు, రచయితలు నాకు వెన్నెముకగా నిలిచి.. నన్ను మలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరో బలమైన కథతో ముందుకు వస్తా. నా మంచి, చెడు కాలాల్లో నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం- ఇట్లు మీ విశ్వక్ సేన్' అంటూ లేఖను విడుదల చేశారు.
కాగా.. ప్రస్తుతం విశ్వక్‌సేన్ జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ డైరెక్షన్‌లో ఫంకీ చిత్రంలో నటిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్ అండ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
🙏 With gratitude #vishwaksen pic.twitter.com/c95Jyal2Il
— VishwakSen (@VishwakSenActor) February 20, 2025