నిస్సహాయులను చుట్టుముట్టి కాల్చేశారు! | Five Terrorist Gun Fire Killed 26 Tourists At Pahalgam | Sakshi
Sakshi News home page

నిస్సహాయులను చుట్టుముట్టి కాల్చేశారు!

Published Wed, Apr 23 2025 5:58 AM | Last Updated on Wed, Apr 23 2025 8:50 AM

Five Terrorist Gun Fire Killed 26 Tourists At Pahalgam

పర్యాటకురాలిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తున్న జవాను

భార్యాపిల్లల ముందే పొట్టన పెట్టుకున్నారు  

పాల్గొన్నది ఐదుగురు ముష్కరులు! 

దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలు

పోయి మోదీకి చెప్పుకొమ్మన్నారు

అందుకే నన్ను ప్రాణాలతో వదిలేస్తున్నామన్నారు 

నా భర్తను కళ్లముందే దారుణంగా కాల్చేశారు 

కర్నాటకకు చెందిన పల్లవి ఆవేదన

పహల్గాం: బైసారన్‌. పహల్గాంకు దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే రిసార్ట్‌ పట్టణం. సుదూరాల దాకా పరుచుకున్న అందమైన మైదానాలు, పైన్‌ అడవులు, మంచు కొండలతో పర్యాటకులకు స్వర్గధామంగా అలరారుతుంటుంది. దశాబ్దాలుగా సినిమా షూటింగులకు, ట్రెక్కర్లకు ఇది ఫేవరెట్‌ స్పాట్‌. ఇక్కడికి చేరుకోవాలంటే కాలినడక లేదా గుర్రాలే శరణ్యం. వేసవి కావడంతో కొద్ది రోజులుగా పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. దాంతో ఉగ్రవాదులు అదను చూసి పంజా విసిరారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. 

భారీ ఆయుధాలతో సమీప అడవుల్లోంచి వచ్చిపడ్డారు. రకరకాల రైడ్‌లను, స్థానిక రుచులను ఆస్వాదిస్తూ, ఫొటోలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్న పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఊహించని దాడితో హాహాకారాలు చెలరేగాయి. పర్యాటకులంతా ప్రాణభయంతో తలో దిక్కు పరుగులు తీశారు. చుట్టూ మైదాన ప్రాంతం కావడంతో కనీసం దాక్కునే వీలు కూడా లేకుండా పోయింది. ఆ క్రమంలో రెండు పర్యాటకుల బస్సులను కూడా ఉగ్రవాదులు అడ్డుకున్నట్టు సాక్షులు తెలిపారు. వారిని ఒక్కొక్కరిగా పేర్లడుగుతూ బస్సుల్లోంచి కిందకు దించారు. హిందువులను మాత్రమే టార్గెట్‌ చేశారు. 

పేరు తప్పు చెప్పారని అనుమానం వస్తే ప్యాంట్లు విప్పించి నిర్థారించుకున్నారు. తర్వాత పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చేశారు. దాంతో 26 మంది పర్యాటకులు నిస్సహాయంగా నేలకొరిగారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఎటు చూసినా శవాలు, తూటా గాయాలకు కుప్పకూలి లేవలేక అల్లాడుతున్న వాళ్లతో పరిస్థితి భీతావహంగా మారింది. 

ఉగ్రమూకల కోసం గాలిస్తున్న ఆర్మీ జవాన్లు  

మృతదేహాల వద్ద మహిళలు గుండెలవిసేలా రోదిస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘‘తూటా నా భర్త తలలోంచి దూసుకెళ్లింది. నా కళ్లముందే కన్నుమూశాడు’’ అంటూ ఓ మహిళ హృదయవిదారకంగా విలపించింది. తన పక్కనున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డట్టు తెలిపింది. ముష్కరులు జమ్మూలోని కిష్త్‌వార్‌ గుండా పాక్‌ నుంచి చొరబడి కొకెర్‌నాగ్‌ మీదుగా వచ్చిపడ్డట్టు భావిస్తున్నారు.

బొమ్మనహళ్లి: భార్య, కుమారునితో కలిసి అప్పటిదాకా ప్రకృతిని ఆస్వాదించాడు. ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సరదాగా గడిపాడు. కాసేపటికే వాళ్ల కళ్లముందే ఉగ్ర కాల్పులకు బలయ్యాడు. కర్నాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్‌రావ్‌ అనే 47 ఏళ్ల రియల్టర్‌ విషాదాంతమిది. విహారయాత్ర కోసం భార్య పల్లవి, కుమారునితో కలిసి 19వ తేదీన ఆయన కశ్మీర్‌ వెళ్లారు. బైసారన్‌లో ఉండగా కాల్పులు చోటుచేసుకున్నాయి. 

మంజునాథ్‌ తూటాలకు బలవగా భార్య, కుమారుడు అభిజేయ సురక్షితంగా బయటపడ్డారు. ఉగ్రవాదులు తమను కావాలనే వదిలేశారని పల్లవి చెప్పారు. ‘‘ఆ సమయంలో 500 మంది దాకా పర్యాటకులం ఉన్నాం. అప్పుడే గుర్రం దిగాం. నా కొడుకు తినేందుకు ఏమైనా దొరుకుతుందా అని నా భర్త దగ్గర్లోని హోటల్లో విచారిస్తున్నారు. అబ్బాయితో పాటు నేనక్కడికి వెళ్తుండగానే కాల్పుల శబ్దం వచ్చింది. ఆర్మీ జవాన్లు కాల్పులు జరుపుతున్నారనుకున్నాం. కానీ జనం పరుగులు చూసి నేను కూడా పరిగెత్తాను. అప్పటికే నా భర్త రక్తపు మడుగులో పడి ఉన్నాడు. 

ముగ్గురు ఉగ్రవాదులు బిస్మిల్లా, బిస్మిల్లా అంటున్నారు. వాళ్లు హిందువులను మాత్రమే లక్ష్యం చేసుకున్నారు. మగవారిని తీవ్రంగా కొడుతున్నారు. ‘‘నా భర్తను ఎందుకింత దారుణంగా హత్య చేశారు, నన్నూ చంపెయ్యండి అన్నాను. ‘మా అమ్మను, నన్ను కూడా చంపండిరా’ అని నా కొడుకు కూడా గట్టిగా అరిచాడు. అయినా వాళ్ల గుండెలు కరగలేదు. ‘మిమ్మల్ని చంపేది లేదు. ఇక్కడ జరిగింది పోయి మీ మోదీకి చెప్పుకొ’మ్మన్నారు. కశ్మీర్‌ చూడాలనేది నా భర్త కల. మా కర్మ కొద్దీ ఇక్కడికొచ్చాం’’ అంటూ ఆమె గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

మగవారే లక్ష్యంగా అంతులేని ఉన్మాదం
నరమేధంలోనూ ఉగ్రవాదులు అంతులేని ఉన్మాదం ప్రదర్శించారు. మగవారిని మాత్రమే లక్ష్యంగా ఎంచుకున్నారు. భార్యాపిల్లల కళ్లముందే వారిని కర్కశంగా కాల్చి చంపి వికృతానందం పొందారు. కాల్పులకు తెగబడింది ఐదుగురు ఉగ్రవాదులని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ‘‘తమకు సమీపంగా ఉన్న 40 మంది పర్యాటకులను చుట్టుముట్టారు. కేవలం హిందువులను మాత్రమే లక్ష్యం చేసుకున్నారు. ఒక్కో పర్యాటకున్నీ పేరడిగి మరీ కాల్చారు’’ అని ఒక మహిళ చెప్పుకొచ్చింది.

కంటతడి పెట్టిస్తున్న సరదా వీడియో
ఘటనకు కాస్త ముందు పల్లవి దంపతులు తీసుకున్న సరదా వీడియో వైరల్‌గా మారి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ప్రకృతి సోయగాలను ఎంతగానో ఆస్వాదిస్తున్నామని, ముందు రోజే షికారా (బోట్‌) రైడింగ్‌ అద్భుతంగా సాగిందని మంజునాథ్‌ ఉత్సాహంగా చెబుతూ కన్పిస్తున్నాడు. భర్త మృతదేహాన్ని త్వరగా తరలించాలని అధికారులను పల్లవి వేడుకున్నారు. వాహనాలు వచ్చే వీల్లేనందున హెలికాప్టర్లో తరలించాలని కోరారు.

మృతుల్లో హైదరాబాద్‌ ఐబీ కార్యాలయ ఉద్యోగి
సాక్షి, సిటీ బ్యూరో:  ఇంటెలిజెన్స్‌ బ్యూరో హైదరాబాద్‌ కార్యాలయంలో సెక్షన్‌ ఆఫీసర్‌ (ఎస్‌ఓ)గా పని చేస్తున్న మనీశ్‌ రంజన్‌ కశ్మీర్‌ ఉగ్ర దాడిలో మరణించారు. బిహార్‌కు చెందిన ఆయన 2022లో హైదరాబాద్‌ బదిలీ అయ్యారు. లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌ కింద మూడు రోజుల క్రితం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కశ్మీర్‌ వెళ్లారు. ఉగ్రవాదులు అడ్డుకున్న టూరిస్టు బస్సుల్లో ఒక దాంట్లో మనీశ్‌ కుటుంబం ఉంది. ఆయనను కుటుంబం నుంచి వేరు చేశారు. పేరు చెప్పగానే నేరుగా తలకు గురిపెట్టి పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చారు. తల భాగం ఛిద్రమై భార్యాపిల్లల ఎదుటే కన్నుమూయడంతో వాళ్లు తీవ్ర షాక్‌కు లోనయ్యారు. మనీశ్‌ మృతి పట్ల హైదరాబాద్‌ ఐబీ కార్యాలయ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

గుర్రాలపైనే ఆస్పత్రికి
ఘటనా స్థలి హృదయ విదారక దృశ్యాలకు వేదికగా మారింది. ఎటు చూసినా రక్తం మరకలు, మృతదేహాలు, క్షతగాత్రులే. ఆదుకోవాలంటూ మిన్నంటిన రోదనలే. గాయపడ్డ వారిని కాపాడేందుకు స్థానికులు తక్షణం స్పందించారు. పర్యాటకులు అక్కడికి చేరుకోవడానికి ఉపయోగించిన పోనీల (పొట్టి గుర్రాల) మీదే క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. కాసేపటికే స్థానిక అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. అంబులెన్సులు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో బాధితులను హెలికాప్టర్లలో తరలించారు. మిగతావారిని కట్టుదిట్టమైన భద్రత నడుమ పహల్గాం క్లబ్‌కు చేర్చారు.

పిరికిపంద చర్య: రాష్ట్రపతి ముర్ము
తీవ్రంగా ఖండించిన వైఎస్‌ జగన్‌
ఉగ్ర దాడిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీన్ని క్షమార్హం కాని పిరికిపంద చర్యగా ముర్ము అభివర్ణించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాందీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తదితరులు దాడిని ఖండించారు. పర్యాటకుల మృతిపై వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఈ ఘటన షాక్‌కు గురి చేసింది. క్షత్రగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నా’’ అంటూ ట్వీట్‌ చేశారు.

అప్పుడూ క్లింటన్‌ పర్యటిస్తుండగానే...
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యం చేసుకోవడం ఇది తొలిసారేమీ కాదు. 2000 మార్చి 21న అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ భారత్‌లో పర్యటిస్తున్న వేళ అనంత్‌నాగ్‌ జిల్లా చట్టీసింగ్‌పురాలో టెర్రరిస్టులు చెలరేగిపోయారు. ఏకంగా 36 మంది సిక్కులను కాల్చి చంపారు. 
2000లోనే అమర్‌నాథ్‌ యాత్రికులపై పహల్గాం బేస్‌ క్యాంప్‌ వద్ద జరిగిన ఉగ్ర దాడిలో 32 మంది మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు. 
⇒ 2001లో 13 మంది, 2002లో 11 మంది అమర్‌నాథ్‌ యాత్రికులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. 
⇒ 2001 అక్టోబర్‌ 1న జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ప్రాంగణంపై జరిగిన ఆత్మాహుతి దాడికి 36 మంది బలయ్యారు. 
⇒ 2002లో జమ్మూ–శ్రీనగర్‌ హైవేపై ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి నలుగురు భద్రతా సిబ్బందితో పాటు 19 మంది మరణించారు. 
⇒ 2003లో పుల్వామా జిల్లా నందిమార్గ్‌లో 24 మంది కశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. 
⇒ 2005లో పుల్వామాలో కిక్కిరిన మార్కెట్‌ ప్రాంతంలో కార్లో పేలుడు పదార్థాలు నింపి పేల్చేయడంతో 13 మంది పౌరులు, ముగ్గురు సీఆరీ్పఎఫ్‌ జవాన్లు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. 
⇒ 2006లో 9 మంది నేపాలీ, బిహారీ కూలీలను కాల్చి చంపారు. 
⇒ 2017లో అమర్‌నాథ్‌ యాత్ర ముగించుకుని తిరిగొస్తున్న భక్తుల బృందంపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు 8 మంది బలయ్యారు.  

100 రౌండ్ల కాల్పులు
బాణసంచా అనుకున్నా 
ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండగా ఒక పర్యాటకుడు మైదాన ప్రాంతాల్లో మిత్రునితో సరదాగా నడుస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ‘‘తొలుత బాణసంచా కాలుస్తున్నారేమో అనుకుని అంతగా పట్టించుకోలేదు. కానీ కాల్పుల శబ్దం అంతకంతకూ పెరిగిపోయింది. అంతా హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తుండటంతో ఉగ్ర దాడి అని అర్థమై వెంటనే పరుగులు తీశాం. కనీసం 100 రౌండ్ల దాకా కాల్చారు’’ అని చెప్పుకొచ్చాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement