
సాక్షి, ఢిల్లీ: పహల్గాం దాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పహల్గాంలో పరిస్థితులతో పాటు భద్రతా సన్నద్ధతపై సైన్యం తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించారు. ఇక.. మోదీతో భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ కూడా పాల్గొన్నారు. మరోవైపు.. రక్షణ వ్యవహారాలపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా సోమవారం భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి ఘటనతో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని వీడేవరకూ ఆ దేశంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన భారత్.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే పాక్ జాతీయులను వారి దేశానికి పంపించింది.
#WATCH | Delhi: Defence Minister Rajnath Singh leaves from 7 Lok Kalyan Marg, Prime Minister Narendra Modi's residence. pic.twitter.com/lCINxlD82x
— ANI (@ANI) April 28, 2025
మరోవైపు.. నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించే పాక్.. కొన్నేళ్లుగా రూటు మార్చిందని నిఘా వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి. ఆన్‌లైన్ వేదికగా కశ్మీరీ యువతను ఆకర్షించి, తమ భావజాలం వైపు మొగ్గు చూపిన వారికి సరైన పత్రాలతో వీసాలిచ్చి పాక్‌లోకి తీసుకెళ్తోందని పేర్కొన్నాయి. తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులను ఎంపిక చేసుకోవడంతో పాటు ఆయుధాలు వాడగల, దాడులు నిర్వహించగల సామర్థ్యం ఉన్నవారిని తమవైపు ఆకర్షిస్తోందని చెప్పాయి.
కొన్నేళ్లలో ఇలా 300 మందికి పైగా కశ్మీర్ యువత అధికారిక ప్రయాణ పత్రాలతో పాక్‌కు ప్రయాణించారని పలు కథనాలు వెల్లడించాయి. వీరిలో పలువురు నిషేధిత ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ పొందుతున్నారు. తర్వాత ఉగ్రసంస్థల్లో చేరి, సరిహద్దు ద్వారా అక్రమంగా చొరబాట్లకు పాల్పడతారు. అనంతరం జమ్ముకశ్మీర్‌లోని పౌరులు, భద్రతా దళాలపై ఉగ్రదాడులు చేస్తారు. అయితే ఇలా చొరబాట్లకు పాల్పడినవారిలో 15 మంది ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. ప్రస్తుతం ఇలా శిక్షణ పొందిన తొమ్మిది మంది క్రియాశీలకంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం. వారిలో కొందరు పాకిస్తాన్‌లో ఉండి, మరికొందరు కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలకు సహకారం అందిస్తున్నారు.

పాక్‌కు సైనిక విమానాలు..
పహల్గాం దాడితో సరిహద్దుల్లో అలజడి వాతావరణం నెలకొంది. భారత్ వైపు నుంచి దాడి ఉండొచ్చన్న అంచనాలతో పాక్ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా టర్కీకి చెందిన పలు సీ-130 హెర్క్యులస్ విమానాలు పాక్‌లో ల్యాండ్ అయ్యాయి. ఈ విమానాల్లో సైన్యానికి అవసరమైన కార్గోను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, భారత్ కూడా అలర్ట్ అయ్యింది.