
దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ముస్లిం జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్ షేక్ అన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచన మేరకు జేఏసీ ఆధ్వర్యంలో అమాయకులైన మృతుల ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు. లబ్బీపేట మసీదులో శుక్రవారం నమాజు ముగిసిన అనంతరం వందలాది మంది ముస్లింలు ఈ శాంతిర్యాలీలో పాల్గొన్నారు. తొలుత భారత ప్రభుత్వం బాధితులకు అండగా నిలవాలని, దోషులను కఠినంగా శిక్షించాలని చేతికి నల్ల రిబ్బన్ కట్టుకుని నమాజ్‌లో పాల్గొన్నారు. మాతృ దేశం కోసం ప్రాణా లైనా అర్పిస్తాం.. పాకిస్తాన్ డౌన్ డౌన్.. అంటూ పెద్ద ఎత్తున ముస్లింలు నినాదాలు చేశారు.
ఉపేక్షించొద్దు.. తిప్పికొట్టాలి..
ఈ సందర్భంగా మునీర్ అహ్మద్ మాట్లాడుతూ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రమూకలు కవ్వింపు చర్యలకు పాల్పడటాన్ని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించ కూడదని, దేశ ప్రజలు అందరూ ఐక్యంగా కుల మతాలకు అతీతంగా తిప్పికొట్టాలన్నారు. దేశ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని, అలాగే ఇస్లాం శాంతిని బోధిస్తోందన్నారు. కానీ మీడియాలో వస్తున్న కథనాలు అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు. ఉగ్రవాదానికి – మతానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర నిఘావర్గాలు వైఫల్యం చెందటం దురదృష్టకరమన్నారు. ముఖ్తార్ అలీ, అబీద్, సుభానీ, నాహీద్, అజ్గర్, ఎస్‌ఐఓ రాష్ట్ర అధ్యక్షుడు అమీర్ ఫహాద్ తదితరులు పాల్గొన్నారు.
ఉగ్రమూకల దాడిని నిరసిస్తూ
లబ్బీపేటలో ముస్లింల శాంతి ర్యాలీ

దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం