
డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌లో లోపాలు ఉన్నాయని, వాటిని తక్షణమే కూటమి ప్రభుత్వం పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను డీఎస్సీకి దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇంటర్, డిగ్రీ, పీజీలో మార్కుల శాతంతో సంబంధం లేకుండా డీఎస్సీకి అనుమతి ఇవ్వాలని కోరారు. బీఈడీ, డైట్ చేసి టెట్ అర్హత సాధించిన వారు ఇప్పుడు ఎందుకు అనర్హులు అయ్యారో చెప్పాలని ప్రశ్నించారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై.రాము, జి.రామన్న మాట్లాడుతూ.. సిలబస్ విస్తృతి రీత్యా అభ్యర్థులకు ప్రిపరేషన్‌కు 90 రోజుల సమయం ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా డీఎస్సీ పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ఏపీపీపీఎస్సీ పరీక్షలు, పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని డీఎస్సీ పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఏడేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ లేనందున అభ్యర్థులకు వయోపరిమితి 47కు పెంచాలని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం, అధికారులు అనాలోచిత విధానాల వలన డీఎస్సీ అభ్యర్థులు రోడ్లపాలు అవ్వాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన వెబ్ సైట్స్‌లో డీఎస్సీకి దరఖాస్తు చేసుకోడానికి అనేక సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేయాలని కోరారు. అనేక మందికి ఎడిట్ ఆప్షన్, సబ్జెక్టు చూపించడం లేద న్నారు. తక్షణమే పై సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకులు శివ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు