
ఫైబర్‌నెట్‌ను ఆర్థికంగా ఆదుకుని నిలబెట్టాలి
● ఆపరేటర్లకు భద్రత కల్పించాలి ● ఫైబర్‌నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ఫైబర్ నెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి నిలబెట్టాలని ఫైబర్‌నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండారు కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ ధర్నా చౌక్‌లో సోమవారం ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్లు శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవానికి అతి తక్కువ ధరలో ఇంటర్నెట్ సర్వీసులను అందించే సత్తా ఒక్క ఏపీ ఫైబర్ నెట్‌కు మాత్రమే ఉందన్నారు. దేశవ్యాప్తంగా డిజిటల్ విప్లవంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచగలిగే కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ఫైబర్ నెట్‌కు ఉందన్నారు. అటువంటి ఫైబర్‌నెట్ ఒడు దొడుకులను ఎదుర్కొంటూ 10లక్షల కనెక్షన్ల నుంచి 5లక్షలకు దిగజారిందన్నారు. ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థను నమ్ముకుని వేలాది మంది ఆపరేటర్లు స్వయం ఉపాధి పొందుతున్నారన్నారు. తాము లక్షలాది రూపాయలను పెట్టుబడులుగా పెట్టడమే కాకుండా వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించి ప్రతి ఇంటికీ ఏపీ ఫైబర్ నెట్ సేవలను తీసుకువెళ్లడంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నామన్నారు. ఫైబర్ నెట్‌ను ఒకే మంత్రిత్వ శాఖ కింద నిర్వహించాలని, ఫైబర్ నెట్ ఆపరేటర్లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆర్థిక భరోసా, వ్యాపార భద్రత, జీవిత బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. సంస్థకు రెగ్యులర్ ఎండీని నియమించాలని కోరారు. ఆర్థికంగా సహాయ, సహకారాలు అందించి సంస్థను కాపాడాలని, ఆపరేటర్లకు భరోసా కల్పించాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశను కలిసి వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మైపాల రాంబాబు, ప్రధాన కార్యదర్శి బోయపాటి శివ ప్రసాద్, ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆలీ, కోశాధికారి శ్రీనివాస్, వివిధ ప్రాంతాలకు చెందిన ఆపరేటర్లు పాల్గొన్నారు.