
నాడు కళకళ...నేడు వెలవెల
● ఒకప్పుడు 72 షాపులతో వంద కోట్ల మేరకు వ్యాపారం ● నేడు సగం షాపుల్లోనే వ్యాపార లావాదేవీలు ● స్థానికంగా ఎక్కడికక్కడ ప్రైవేటు దుకాణాలు వెలవడమే కారణం
విజయవాడరూరల్: ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన నున్న మ్యాంగో మార్కెట్ నేడు వ్యాపారాలు లేక వెలవెలబోతోంది. 1999 వ సంవత్సరంలో అప్పటి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, భారీ పరిశ్రమల శాఖా మంత్రి కోటగిరి విద్యాధరరావు చేతుల మీదుగా ప్రారంభమైన నున్న మ్యాంగో మార్కెట్ దాదాపు 15 ఏళ్ల పాటు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింది. గత పది సంవత్సరాల నుంచి క్రమేపీ వ్యాపార లావాదేవీలు తగ్గుముఖం పట్టి తిరోగమనం దిశగా ఉంది. ఆసియాలోనే అతి పెద్ద మ్యాంగో మార్కెట్ గా పేరొందిన ఈ మ్యాంగో మార్కెట్ నుంచి సుమారు వంద కోట్ల రూపాయల వ్యాపారం ప్రతి మామిడి సీజన్లో జరిగేది. ఇక్కడ నుంచి మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్ తదితర ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు విస్తృతంగా జరిగేవి. కాలక్రమంలో మండల స్థాయిలో ప్రైవేటుగా వ్యాపార దుకాణాలు ఈదర, నూజివీడు, ఎ. కొండూరు, విస్సన్నపేట, చనుబండ, జి.కొండూ రు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల నున్న మ్యాంగో మార్కెట్ దాని ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే మామిడి రైతులకు రవాణా ఖర్చులు, హమాలీ చార్జీలు తడిసి మోపెడవుతున్నాయని, గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో 72 షాపులకు గాను ఈ ఏడాది మామిడి సీజన్లో మార్కెట్లో 40 షాపుల్లో మాత్రమే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. గత నాలుగు సంవత్సరాల నుంచి మామిడి పూత దశలో కోడిపేను అనే వ్యాధి సోకడంతో ఆశించిన మేర దిగుబడులు లేక జిల్లాలోని మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది ఈ నెలలో కురిసిన అకాల వర్షాల కారణంగా భూమిలో తేమశాతం అధికంగా ఉండి మంగు వ్యాధి ఎక్కువగా వచ్చింది. ఆ వ్యాధి ప్రభావంతో మామిడిలో నాణ్యత లోపించడం వలన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మామిడి బయ్యర్లు ఆసక్తి చూపించడం లేదు. ఈ ఏడాది 10 మంది బయ్యర్లు మాత్రమే రంగ ప్రవేశం చేశారు. దీంతో మామిడి కొనుగోళ్లు మందగించాయి. దీని ప్రభావంతో రోజుకు 20 లారీలు కూడా ఎగుమతులు జరగడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మామిడి రైతుల బాగోగుల గురించి పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మామిడి పంట, మామిడి రైతులపై సానుకూల దృక్పథంతో ఆలోచించి ఇతర దేశాలకు కూడా మన మామిడి ఎగుమతులు జరిగేందుకు సహాయ సహకారాలు అందించాలని రైతులు కోరుతున్నారు.
గత ప్రాభవం కోల్పోయిన నున్న మ్యాంగో మార్కెట్
మామిడి దిగుబడులు తగ్గాయి
నున్న గ్రామంలో నాకు నాలుగు ఎకరాల మామిడి తోటలున్నాయి. గత సంవత్సరం 30 టన్నుల మామిడి కాయల దిగుబడులు వచ్చి లక్ష రూపాయల ఆదాయం లభించింది. ఈ ఏడాది దిగుబడులు బాగా తగ్గిపోయాయి. వ్యాధులను నివారించడానికి మందులు వాడటంతో ఖర్చు పెరిగింది. ఖర్చులు పోను రూ.20వేల ఆదాయం కూడా వస్తుందనే ఆశ లేదు.
–భీమవరపు శివశేషిరెడ్డి,
మామిడి రైతు, నున్న
అవగాహన సదస్సులు నిర్వహించాం
మామిడి తోటలను ఆశించిన కోడిపేను, మంగు వ్యాధులను నివారించేందుకు రైతులకు అవగాహన సదస్సులను నిర్వహించాం. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మామిడి దిగుబడులు తగ్గాయి.
–బాలాజీ జిల్లా ఉద్యానశాఖ అధికారి

నాడు కళకళ...నేడు వెలవెల