
తాడేపల్లి : సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన నాయకుడు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అని పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం) పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సెల్ సమావేశంలో సజ్జల పాల్గొన్నారు.ఈ సమావేశానికి మాజీ మంత్రులు జోగి రమేష్, ధర్మాన కృష్ణదాస్, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్, అన్ని జిల్లాల బీసీ నేతలు హాజరయ్యారు.
దీనిలో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘బీసీలంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అని జగన్ నిరూపించారు. చంద్రబాబుది అవకాశవాద రాజకీయం. అధికారంలోకి రాగానే దోచుకోవడం, దాచుకోవడమే. ఈసారి మరింత బరి తెగించి వ్యవహరిస్తున్నారు. ఈ పది నెల చంద్రబాబు పాలన చూస్తేనే జనానికి అర్ధమవుతుంది. ఈ దుర్మార్గపు పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయాలి. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి. గతంలో కంటే మెరుగ్గా పూర్తిస్థాయి కమిటీలు నియమించుకుందాం’ అని సజ్జల పేర్కొన్నారు.
రాష్ట్రంలో నియంతృత్వ పాలనను చూస్తున్నాం
అధికార యంత్రాంగమే మాఫియా ముఠాలా వ్యవహరిస్తోంది.అందరూ కలిసి ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేస్తున్నారు, విశాఖలో నానారకాలుగా అక్రమాలు చేసి బీసీ మహిళను పదవి నుంచి తప్పించారు. కూటమి నేతల ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను గట్టిగా తిప్పికొడదాం’ అని సజ్జల సూచించారు.