మీడియాతో మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి చిత్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసన సభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు వేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు మంగళవారం దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకోసం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ‘మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం’ పేరుతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, జగనన్న సచివాలయ కన్వీనర్లు సహా 2,700 మందికిపైగా నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారికి సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఈ సమావేశం ఏర్పాట్లను సోమవారం వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇతరులు కూడా ఉన్నారు.
ప్రజాక్షేత్రంలో వైఎస్సార్‌సీపీ దూకుడు
రాష్ట్రంలో గత 58 నెలలుగా రాష్ట్రంలోని ప్రతి పేదింటి భవిష్యత్తును గొప్పగా మార్చేలా సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన అందిస్తుండటంతో వైఎస్సార్సీపీకి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఇది ప్రతిబింబించింది. సుపరిపాలన వల్ల ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్లీన్ స్వీపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని 2022 మే 11న ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
అప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతోంది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు నీరాజనాలు పట్టారు. గత నెల 27న భీమిలి వేదికగా ఎన్నికలకు ‘సిద్ధం’ అంటూ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల శంఖం పూరించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో దూకుడు మరింత పెంచాయి. వచ్చే నెల 3న పల్నాడు ప్రాంతంలో పిచ్చికలగుడిపాడు ‘సిద్ధం’ చివరి సభ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు సిద్ధం: సజ్జల రామకృష్ణారెడ్డి
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. గత 58 నెలలుగా సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, సుపరిపాలనను ప్రతి గడపకూ తీసుకెళ్తున్నారు. ఈసారి ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా మేం సమర్థవంతమైన టీమ్‌ను సిద్ధం చేసుకున్నాం. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నాం.
ప్రభుత్వం చేసిన మంచిని మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టడం, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం నిర్వహించే కీలక సమావేశంలో నేతలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. మేం సమన్వయకర్తలను నియమించేటప్పుడు ఏదో జరిగిపోతున్నట్లుగా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయి. కానీ.. సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న నమ్మకంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. టీడీపీ–జనసేన కూటమి అతుకులబొంత అని సీట్ల సర్దుబాటులోనే స్పష్టమైంది.
పవన్‌ను అనుసరిస్తున్న శ్రేణులను ఘోరంగా అవమానిస్తూ చంద్రబాబు జనసేనకు 24 సీట్లు పడేశారు. ఆ రెండు పార్టీల్లో అసంత్పప్తి పెల్లుబుకుతోంది. టీడీపీ, జనసేన అసంతృప్త నేతలు గంపగుత్తగా వైఎస్సార్సీపీలో చేరుతామంటున్నారు. కానీ.. మేం ఎవరిని పడితే వారిని చేర్చుకోం. వారి వల్ల అనవసరమైన తలనొప్పులు. అవకాశం ఉన్న చోట మాత్రమే ఆ పార్టీల నేతలను చేర్చుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment