
కుటుంబ సభ్యులపైనే పగ..ప్రతీకారాలు
నిర్భయంగా.. కిరాతకంగా హత్యలు చేస్తున్న వైనం
ఆస్తి, డ్రగ్స్, ప్రేమ, వివాహేతర సంబంధాలే కారణాలు
పరిష్కరించుకొనే మార్గాలున్నా విపరీత ప్రవర్తన
సొంత కుటుంబాలనే చిదిమేసుకుంటున్న వ్యక్తులు
మూఢ నమ్మకాలతో ఏడు నెలల కూతురిని చంపిన తల్లికి ఈ నెల 11న మరణశిక్ష విధించిన
సూర్యాపేట జిల్లా కోర్టు
సాక్షి, హైదరాబాద్: ఒకరిది ప్రతీకారేచ్ఛ..మరొకరిది ఆస్తుల కోసం ఆరాటం. కారణమేదైనా కొందరి విపరీత ప్రవర్తన కుటుంబ బంధాలు, అనుబంధాలను చిన్నాభిన్నం చేస్తోంది. మూఢ నమ్మకాలతో కన్నతల్లే నెలల పసికందును చంపిన ఘటన ఒకటైతే.. తోబుట్టువులే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న సంఘటన మరోటి.. ప్రేమపేరుతో మరికొందరు ఉన్మాదులై స్వైరవిహారం చేస్తున్నారు. వివాహేతర సంబంధాలతో ఇంకొందరు కుటుంబాలను చిదిమేసుకుంటున్నారు.
⇒ సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో 2025 మార్చి 27న జరిగిన ఒక దారుణ ఘటనలో రజిత తన ముగ్గురు పిల్లలను విషంఇచ్చి చంపినట్టు పోలీసులు తేల్చా రు. ఈ హత్యల వెనుక వివాహేతర సంబంధం కారణమని విచారణలో తేలింది. జీవితం మొత్తం జైలుపాలవుతామని తెలిసినా వీసమెత్తు భయం లేకుండా నడిరోడ్లపైనే విపరీత చర్యలకు పూనుకుంటున్నారు. ఇందుకు కారణాలేంటి? ఎందుకు ఈ విపరీత ప్రవర్తన పెరుగుతోంది? సున్నితమైన ఈ అంశాలపై లోతైన చర్చ జరగాల్సిన అవసరముంది.
⇒ మూఢ నమ్మకాల పేరుతో 2021 ఏప్రిల్‌లో మోతె మండలం మేకలపాటి తండాలో తన ఏడు నెలల కూతురిని చంపిన కేసులో తల్లి బాణోతు భారతికి సూర్యాపేట జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ ఈ నెల 11న సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో కుటుంబ బంధాలపై కత్తివేటు వేస్తున్న ఘటనలపై మరోమారు చర్చ మొదలైంది.
ఆస్తుల కోసం హత్యలు
⇒ మద్యపానం..జూదం..ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి వ్యసనాలకు బానిసలవుతున్న కొందరు యువకులు.. డబ్బు, వారసత్వ ఆస్తుల కోసం కుటుంబ సభ్యులనే హతమారుస్తున్నారు. ఆ తర్వాత జరిగే పరిణామాలను పట్టించుకోవటం లేదు.
⇒ ఆస్తిలో వాటా ఇవ్వడం లేదని హైదరాబాద్‌లో వెలిజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ చంద్రశేఖర జనార్దన్‌రావును ఆయన మనుమడు కిలారు కార్తి తేజ గత నెలలో 72 సార్లు కత్తితో పొడిచి చంపాడు.
⇒ ఆస్తి కోసం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో కన్నతల్లి రాధికను కొడుకు కార్తీక్ కత్తితో ఎనిమిదిసార్లు పొడిచి హత్య చేశాడు.
విపరీత ప్రవర్తనను ముందే పసిగట్టాలి
ఏ వ్యక్తి గురించైనా వారి కుటుంబ సభ్యులకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. పుట్టినప్పటి నుంచి వారి ప్రవర్తనను గమనించే అవకాశం తల్లిదండ్రులు, తోబుట్టువులకే ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా చిన్ననాటి నుంచే విపరీత ప్రవర్తనను కలిగి ఉండడం..చెడు వ్యసనాలకు బానిసలవుతున్నట్టు గమనిస్తే..వారి వయస్సును బట్టి మందలించడం..దండించడం..ప్రతిసారి దూషిస్తూ..ఎదుటివారి ముందు తక్కువ చేసి మాట్లాడం పక్కన పెట్టి..ఎందుకు ఆ ప్రవర్తన కలిగి ఉంటున్నారు అన్నది మూలాల నుంచి గమనించే ప్రయత్నం చేయాలి.
అవసరం మేరకు వారికి మానసిక వైద్యులతో చికిత్స అందించడం...లేదంటే కౌన్సెలింగ్ ఇప్పించడం వంటి మార్గాలను ఎంచుకోవాలి. కుటుంబ సభ్యుల పట్ల పగ, ద్వేషం పెరుగుతున్నట్టు గమనిస్తే వెంటనే తగినంత సమయాన్ని వారికి కేటాయించి..వారి ఇబ్బందులు ఏంటి..అందుకు కుటుంబ పరంగా ఎలాంటి సహకారం అవసరమన్నది గమనించి అందుకు తగ్గట్టుగానే చర్యలు తీసుకోవాలి.
ఈ తరహా ఘటనలు మరికొన్ని..
ళీ హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో లక్ష్మి తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారన్న అక్కసుతో తల్లి సుశీల, అక్క జ్ఞానేశ్వరిలను ప్రియుడితో హత్య చేయించింది.
ళీ జనవరిలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురుమూర్తి భార్యను హత్యచేసి ముక్కలుగా నరికి ఉడకబెట్టిన ఘటన సంచలనంగా మారింది.
ళీ ఫిబ్రవరిలో కాప్రా పరిధిలో మొగిలిని అతడి కుమారుడు సాయికుమార్ నడిరోడ్డుపై కత్తితో నరికి చంపాడు.
చట్టాలపై అవగాహన పెంచాలి
చట్టాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చన్న విషయాన్ని కొందరు పట్టించుకోవటం లేదు. కారణం ఏదైనా తప్పు చేస్తే చట్టం నుంచి తప్పించుకోలేరు అన్నది మరవొద్దు. హత్యలు చేసిన నిందితులు విలువైన జీవితం కోల్పోవడంతోపాటు కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసినట్టు అవుతుంది. నేరం చేస్తే ఎదురయ్యే పరిణామాలను ప్రజలకు తెలియజెప్పాలి. –పెందోట శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాది
పక్కా ప్రణాళికతో చేసే హత్యలివి
ఇలాంటి హత్యలన్నీ పక్కా ప్రణాళికతో చేసేవే. క్షణికావేశంలో చేస్తున్నవి కాదు. ఇటీవల జరిగిన ఏ ఘటనను క్షుణ్ణంగా పరిశీలించినా ఇది అర్థం అవుతుంది. ఇది ఒక రకమైన పర్సనాలిటీ డిజార్డర్. ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన చిన్ననాటి నుంచే విపరీతంగా ఉంటుంది. సకాలంలో గుర్తించి సరైన వైద్యం, కౌన్సెలింగ్ చేయిస్తే ఫలితం ఉంటుంది. అలా కాకుండా వారిని మార్చేందుకు ఆంక్షలు పెట్టడం, నిందిస్తూ మాట్లాడితే చివరకు కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకుంటారు. అదును కోసం ఎదురు చూసి హతమార్చేందుకు సిద్ధమవుతారు. – డా.సి.వీరేందర్, సైకాలజిస్ట్