
పాఠ్య పుస్తకాలు సిద్ధం!
● జిల్లాలో 9,86,120 పుస్తకాలు అవసరం ● ఇప్పటికి చేరినవి 2,22,820 ● పాఠశాలలు ప్రారంభం రోజునాటికి అందించేలా చర్యలు
కల్హేర్(నారాయణఖేడ్): ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం 2025–26కు సంబంధించిన పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుకుంటున్నాయి. జూన్ 12న పాఠశాలల ప్రారంభం నాటికి విద్యార్థులకు పుస్తకాలు అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్య లు చేపడుతోంది. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో పనులు చేపడుతోంది. ఇందులోభాగంగానే విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు అందిస్తోంది. గతేడాది పాఠ్యపుస్తకాలు ముద్రణ ఆలస్యంగా జరగడంతో విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందించలేకపోయారు. గత విద్యా సంవత్సరం అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ఈసారైనా పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందించేందుకు విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందుకు అవసరమైన పుస్తకాలు జిల్లాకు విడతల వారీగా అందిస్తున్నారు. అక్రమాలకు అవకాశం లేకుండా ఉండేందుకు క్యూఆర్ కోడ్ పద్ధతిలో పుస్తకాల ముద్రణ చేపట్టారు. క్యూర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా జిల్లా, మండలం, పాఠశాల పేరుతో ఆన్‌లైన్‌లో సమాచారం వచ్చేస్తుంది.
జిల్లాలో 1,17,238 మంది విద్యార్థులు..
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 1,17,238 మంది విద్యార్థులు చదువుతున్నారని గుర్తించారు. 9,86,120 పుస్తకాలు అవసరం ఉన్నట్లు నిర్ధారించారు. ఇప్పటికే 2,22,820 పుస్తకాలు జిల్లాకు చేరాయి. వచ్చిన పుస్తకాలు డీఈఓ సమావేశ మందిరం, పాత ఎస్‌ఎస్‌ఏ కార్యాలయాల సమీపంలో గోదాంలలో భద్రపరిచారు. తెలుగు–ఆంగ్లం పద్ధతిలో పుస్తకాలు ముద్రించారు. మేలో పూర్తిస్థాయిలో పుస్తకాలు జిల్లాకు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పుస్తకాలు వచ్చాక మండల కేంద్రాలకు, అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేస్తారు. పాఠశాలలు ప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటామని డీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు.