
భూభారతి దేశానికే ఆదర్శం
● రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
● వర్గల్ మండలం శాకారంలో చట్టంపై అవగాహన సదస్సు
● పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్
వర్గల్(గజ్వేల్): దేశంలోనే చరిత్రాత్మకంగా, రోల్‌మోడల్‌గా భూభారతి చట్టం నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ మనుచౌదరి అధ్యక్షతన వర్గల్ మండలం శాకారంలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సుకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిలతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రైతులు ఆత్మగౌరవంతో జీవించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టం ఒక వరమని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా నిలిచిన భూ సమస్యలు పరిష్కారం కానున్నాయని వివరించారు. మనిషికి ఆధార్ మాదిరిగా, భూమి ఉన్న ప్రతి రైతుకు హక్కులు కల్పిస్తూ భూధార్ సంఖ్య కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. ధరణి పోర్టల్‌తో అనేక ప్రభుత్వ, అసైన్డ్ భూములు, వక్ఫ్, దేవాదాయ తదితర భూములు పక్కదారి పట్టాయన్నారు. వేలాది ఎకరాలు పార్ట్‌బీలో చేరాయని, సాదాబైనామాలు పెద్ద ఎత్తున ఆన్‌లైన్ దరఖాస్తులకే పరమితమయ్యాయన్నారు. రికార్డులో తప్పుల నమోదుతో అత్యవసర పరిస్థితులలో అర ఎకరం భూమి అమ్ముకుందామంటే అమ్మలేని దయనీయ స్థితిని ధరణి కారణంగా రైతులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారంగా భూభారతి చట్టం తీసుకువచ్చామన్నారు. దీనిని చట్టబద్ధం చేసేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే తమ ఉనికికే ప్రమాదమని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ నానా ప్రయత్నాలు చేసిందన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడికి అండగా నిలుస్తూ సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల దాకా ప్రజల్లోనే ఉంటున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా, గజ్వేల్ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రికార్డుల పరంగా పలువురు రైతులు తాము ఎదుర్కొంటున్న భూసంబంధ సమస్యలను వేదికపై మంత్రికి నివేదించారు. వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాగా ఇదే వేదికపై పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు.

భూభారతి దేశానికే ఆదర్శం