ఇంటి పెరట్లో.. మేడపైన మొక్కలు పెంచడం సహజం. కానీ వీటన్నింటికీ భిన్నంగా ఆటోపై మట్టికుండీలు అమర్చి వాటిలో మొక్కలు పెంచుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు ఓ ఆటోవాలా. అంతే కాదండోయ్ పర్యావరణం పట్ల తన ఆటోలో ప్రయాణించేవారికి అవగాహన కల్పిస్తున్నారు. మండుతున్న వేసవిలోనూ ఈ ఆటోలో ప్రయాణిస్తే చాలా కూల్‌కూల్‌గా ఉంటోంది. వినూత్న పద్ధతిలో ఆటోను డిజైన్ చేసి నడుపుతున్న డ్రైవర్ అంజిని ‘సాక్షి’ సోమవారం పలకరించింది. మహబుబాబాద్ జిల్లా పూసపల్లికి చెందిన అంజి తన ఆటోకు పచ్చిగడ్డి, పూలమొక్కలను ఏర్పాటు చేసి ప్రకృతిని కాపాడాలంటూ వందల కిలోమీటర్లు తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వేసవిలో ప్రయాణికులు ఉపశమనం పొందేలా కూలర్ లాంటి ఫ్యాన్‌ను, చల్లని మంచినీటిని ఏర్పాటు చేశారు. వికలాంగులు, కంటి చూపు లేని వారిని ఉచితంగా తన ఆటోలో తమ తమ గమ్య స్థానాలకు చేరవేస్తున్నట్లు అంజి తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి, వాటిని కాపాడాలని, ప్రకృతిని ప్రేమించాలని కోరుతున్నారు అంజి. – సిద్దిపేటకమాన్