
వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయండి
సిద్దిపేటరూరల్: హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాల స్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలస్వామి మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. అలాగే 50 ఏళ్లు నిండిన ప్రతి హమాలీకి నెలకు రూ.10వేల పెన్షన్ ఇవ్వాలన్నారు. ఐకేపి, పీఏసీఎస్ ల ఆధ్వర్యంలో చేపడుతున్న కొనుగోలు కేంద్రాలు హమాలీ కార్మికులతో నడుస్తున్నాయన్నారు. కొన్ని సార్లు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్న క్రమంలో ప్రభుత్వం వారికి రక్షణగా నిలవాలన్నారు. కార్మికులకు కొనుగోలు కేంద్రం ద్వారానే కూలిని చెల్లించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన హమాలీకి రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలన్నారు. సాధారణ మరణం పొందితే రూ.5లక్షలు అందించాలన్నారు. లేని పక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రవికుమార్ , కమిటి సభ్యులు అమ్ముల బాలనర్సయ్య, హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షుడు మామిడాల కనకయ్య, నాయకులు ఎల్లయ్య, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.
హమాలీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాల స్వామి డిమాండ్