
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ పోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మపై హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
రోహిత్ శర్మతో తనకు మంచి అనుబంధం ఉందని గంభీర్ తెలిపాడు. కాగా రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ఫైనల్‌కు చేరడంలో కోచ్ గంభీర్ పాత్ర కూడా ఉంది.
అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ చేయడం, వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకురావడం వంటివి గంభీర్ తీసుకున్న నిర్ణయాలే. అయితే వైట్‌బాల్ క్రికెట్‌లో కెప్టెన్‌గా, కోచ్‌గా అదరగొడుతున్న రోహిత్-గంభీర్ జోడీ.. రెడ్ బాల్ క్రికెట్‌లో ఇంకా తమ మార్క్ చూపించలేకపోయారు.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఘోర పరాభావం తర్వాత వీరద్దరూ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచి విమర్శించిన వారితోనే శెభాష్ అన్పించుకోవాలని వీరు భావిస్తున్నారు.
"రోహిత్ శర్మ తనొక కెప్టెన్ అని, అన్ని అధికారాలు ఉన్నాయని ఎన్నడూ భావించలేదు. అద్భుతమైన వ్యక్తిత్వం కలవాడు. అతడితో నాకు బలమైన అనుబంధం ఉంది. మంచి మనసు ఉన్న వారు మంచి నాయకుడిగా కూడా మారుతారు. అందుకే ఐపీఎల్‌లో అతడు కెప్టెన్‌గా అన్ని టైటిల్స్ సాధించగలిగాడు.
భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందించాడు. అయితే చరిత్ర ఎప్పుడు గతంగానే ఉంటుంది. ఇప్పుడు మా ముందు కొత్త సవాలు ఉంది. ఫైనల్ మ్యాచ్‌లో కూడా అతడు బ్యాటర్ గానే కాకుండా సారథిగా కూడా అత్యుత్తమ ప్రదర్శన చేయగలడని ఆశిస్తున్నాను" అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతీ పేర్కొన్నాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత హిట్‌మ్యాన్ భారత వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగే సూచనలు కన్పిస్తున్నాయి.
చదవండి: పాతికేళ్ల పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?