
Photo Courtesy: BCCI
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు (ఏప్రిల్ 23) ఐపీఎల్లో జరుగబోయే సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు ముందు ఓ నిమిషం మౌనం పాటించాలని నిర్ణయించింది.
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు, మ్యాచ్ అఫీషియల్స్ నల్లటి బ్యాండ్లు ధరించాలని పిలుపునిచ్చింది. మ్యాచ్ సమయంలో బాణసంచా కాల్చకూడదని గైడ్ లైన్స్ జారీ చేసింది. మ్యాచ్ సందర్భంగా చీర్ లీడర్ల ప్రదర్శనలు ఉండవని స్పష్టం చేసింది.
కాగా, కశ్మీర్‌లోని పహల్గామ్లో నిన్న (ఏప్రిల్ 22) మధ్యాహ్నం భయానమైన ఉగ్రవాద దాడి జరిగింది. పహల్గామ్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం సమీపంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులు.
2019 పుల్వామా దాడి తర్వాత కశ్మీర్లో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడి ఇదే. ఈ విషాద ఘటనతో దేశం మొత్తం నిర్ఘాంతపోయింది. ఈ ఉగ్రదాడిని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించింది. బీసీసీఐ సహా భారత క్రికెటర్లు బాధితులకు నివాళులర్పించి, సంతాపం తెలియజేశారు.
ఇదిలా ఉంటే, ఇవాళ (ఏప్రిల్ 23) రాత్రి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్లో ఇరు జట్లు తలపడటం ఇది రెండోసారి. ఏప్రిల్ 17న తమ హోం గ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌లో ముంబై హైదరాబాద్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది.
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తప్పక గెలవాలి. ఈ మ్యాచ్‌లో ఓడితే సన్‌రైజర్స్ అనధికారికంగా లీగ్ నుంచి నిష్క్రమించినట్లే. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు కూడా కీలకమే.
ఆ జట్టు కూడా ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఈ సీజన్లో సన్‌రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట ఓడి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ముంబై 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి ఆరో స్థానంలో కొనసాగుతుంది.
నేటి మ్యాచ్ సన్‌రైజర్స్ తమ సొంత ఇలాకాలో ఆడుతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. తమ విధ్వంసకర ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో తప్పక చెలరేగుతారని సన్‌రైజర్స్ అభిమానులు ఆశిస్తున్నారు. సన్‌రైజర్స్‌కు హోం గ్రౌండ్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఇక్కడ ఆడిన మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఆటగాళ్లు పేట్రేగిపోయారు. నేటి మ్యాచ్‌లో అదే జోరు కొనసాగిస్తారో లేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి.
తుది జట్లు (అంచనా)
సన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (c), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ, ఎషాన్ మలింగ
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (wk), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్