
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఎట్టకేలకు తన ప్రేమ బంధాన్ని బహిర్గతం చేశాడు. సోఫీ షైన్ (Sophie Shine)తో కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టు ద్వారా ధ్రువీకరించాడు. కాగా భారత జట్టు ఓపెనర్‌గా ఎన్నో ఘనతలు సాధించిన శిఖర్.. ఆ తర్వాత జట్టులో చోటే కరువు కావడంతో ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇక వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు శిఖర్ ధావన్. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీ (Aesha Mukherjee)అనే డివోర్సీని 2011లో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా వారిని తన సొంత కూతుళ్లలా చూసుకుంటానని గబ్బర్ పలు సందర్భాల్లో వెల్లడించాడు.
భార్యతో విడాకులు
ఇక శిఖర్- ఆయేషాలకు జొరావర్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే, ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట మధ్య విభేదాలు తలెత్తి విడాకులకు దారితీసింది. 2023లో శిఖర్- ఆయేషాలకు విడాకులు మంజూరయ్యాయి.
అప్పటి నుంచి నుంచి ఒంటరిగా ఉంటున్న శిఖర్ ధావన్.. కనీసం తన కుమారుడిని కలిసేందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా లేవంటూ పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు. ఇక ఇప్పుడు అతడు సోఫీ రూపంలో మరోసారి ప్రేమను వెదుక్కున్నాడు.
ఇంతకీ ఎవరీ సోఫీ షైన్?
సోఫీ షైన్ ఐర్లాండ్‌కు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఐర్లాండ్‌లోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె.. మార్కెటింగ్- మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసింది.
ఇక ప్రస్తుతం నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్ అనే కంపెనీలో సెకండ్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో సోఫీ పనిచేస్తున్నట్లు సమాచారం. ఇది అమెరికన్ ఫైనాన్షియల్ కంపెనీ అని తెలుస్తోంది.
ఇక వృత్తిరీత్యా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్న సోఫీకి అక్కడే శిఖర్‌తో పరిచయమైనట్లు సమాచారం. ఈ క్రమంలో స్నేహం ప్రేమగా మారి ఇద్దరూ సహజీవం చేస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది.
అందమైన మహిళే నా గర్ల్‌ఫ్రెండ్
కొన్నిరోజుల క్రితం శిఖర్ ధావన్ ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. అతడి రిలేషన్‌షిప్ గురించి ప్రశ్న ఎదురైంది. ప్రేయసి పేరు చెప్పాలంటూ గబ్బర్‌ను యాంకర్ ప్రశ్నించగా.. ‘‘నేను పేరు మాత్రం చెప్పను.. అయితే, ఇక్కడే ఉన్న అమ్మాయిల్లోకెల్లా అందమైన మహిళే నా గర్ల్‌ఫ్రెండ్’’ అని చెప్పాడు. అంతలో లైట్ సోఫీ ముఖంపై పడింది.
ఇక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో.. సోఫీతో దిగిన ఫొటోను షేర్ చేసిన ధావన్.. ‘‘మై లవ్’’ అంటూ అధికారికంగా తమ బంధం గురించి అభిమానులతో పంచుకున్నాడు. అయితే, పెళ్లి గురించి మాత్రం ఇంకా కన్‌ఫామ్ చేయలేదు.
కాగా 2010 నుంచి 2022 మధ్య శిఖర్ ధావన్ టీమిండియా తరఫున అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాడు. తన కెరీర్‌లో 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 2315, 6793, 1759 పరుగులు సాధించాడు.
భారత జట్టు మేటి ఓపెనర్‌గా పేరొందిన శిఖర్ ధావన్ ఖాతాలో ఏడు టెస్టు, 17 వన్డే శతకాలు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో ఏకంగా 222 మ్యాచ్‌లు ఆడిన ఈ ఢిల్లీ స్టార్.. రెండు సెంచరీలు, 51 అర్ధ శతకాల సాయంతో 6768 పరుగులు సాధించాడు.
చదవండి: పిల్లలంతా హ్యాపీ అంటూ ట్రోలింగ్!.. వైభవ్‌ను ఓదార్చిన రోహిత్.. ఆటలో ఇవి మూమూలే