ఐర్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సిమ్రన్‌జిత్ సింగ్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. కాలేయ మార్పిడి విజయవంతంగా జరిగిందని.. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు వెల్లడించాడు. అదృష్టవశాత్తూ తన భార్యే దాతగా మారిందని.. ఆమె మంచి మనసు, అభిమానుల ప్రార్థన వల్లే ప్రాణాలతో బయటపడ్డాడని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.
పంజాబ్‌కు ఆడిన సిమి
కాగా సిమ్రన్‌జిత్ సింగ్ భారత్‌లోని పంజాబ్‌లో గల మొహాలిలో జన్మించాడు. సిమి సింగ్‌గా ప్రసిద్ధి చెందిన అతడు భారత దేశవాళీ క్రికెట్‌లో అండర్-14, అండర్-17 స్థాయిలో పంజాబ్ తరఫున ఆడాడు. కానీ ఈ లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్‌కు భారత అండర్-19 జట్టులో మాత్రం స్థానం దక్కలేదు. దీంతో మళ్లీ చదువుపై దృష్టి సారించిన సిమి.. 2005లో ఐర్లాండ్‌కు వెళ్లిపోయాడు. అక్కడే హోటల్ మేనేజ్‌మెంట్ చేశాడు.
అవకాశాలు లేక ఐర్లాండ్‌కు వెళ్లి
అయితే, క్రికెట్‌పై మక్కువ తగ్గకపోవడంతో 2006లో డబ్లిన్‌లో ప్రొఫెషనల్ క్రికెటర్ మారిన అతడు.. 2017లో ఐర్లాండ్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ప్రతిభను చాటుకుంటూ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన 37 ఏళ్ల సిమి.. మొత్తంగా ఇప్పటి వరకు 35 వన్డేల్లో 39, 53 టీ20లలో 44 వికెట్లు తీశాడు. అంతేకాదు.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు.
సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్‌గా
ఈ క్రమంలో... 2020లో సిమికి ఐర్లాండ్ సెంట్రల్ కాంట్రాక్టు దక్కింది. కాగా సిమి సింగ్ లివర్ పూర్తిగా పాడైపోయినట్లు అతడి కుటుంబ సభ్యులు ఇటీవల మీడియాకు తెలిపారు. అతడిని ఇండియాకు తీసుకువచ్చామని.. గురుగ్రామ్‌లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా సిమి సింగ్ స్వయంగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్ అందించాడు.
నా భార్య వల్లే ఇదంతా
‘‘అందరికీ హాయ్.. నా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ విజయవంతంగా పూర్తైంది. 12 గంటల పాటు శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. తప్పుడు యాంటి బయాటిక్స్, స్టెరాయిడ్స్‌ను కొందరు నాకు ప్రిస్కైబ్ చేశారు. వాటి వల్లే లివర్ పాడయ్యే దుస్థితి తలెత్తింది.
నా భార్యే నాకు కాలేయ దాత కావడం నిజంగా నా అదృష్టం. నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా’’ అని సిమి సింగ్ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.నిపుణులు సూచించిన మందులనే వాడాలని తన ఫాలోవర్లను అప్రమత్తం చేశాడు.
చదవండి: Ind vs Aus: ఆ ముగ్గురు బ్యాటర్లు ప్రమాదకరం: ఆసీస్ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment