డబ్లిన్: టీమిండియా క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లిని ఇప్పటి వరకూ ఎప్పుడూ కలవలేదని, వారిని టీవీలో మాత్రమే చూశానని అంటున్నాడు ఐర్లాండ్ క్రికెటర్ సిమి సింగ్. భారత్‌లో పుట్టిన సిమి సింగ్ పంజాబ్ తరపున క్రికెట్ ఆడాడు. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో ఐర్లాండ్ వెళ్లిపోయాడు. అక్కడ స్థానిక టోర్నమెంట్‌లో రాణించి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. త్వరలో భారత్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో సిమి సింగ్ ఐర్లాండ్ తరపున ఆడుతున్నాడు. 2006లో సిమి హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదివేందుకు ఐర్లాండ్‌కు వెళ్లి అక్కడే స్థిరపడిపోయాడు.
అయితే తన ఫేవరెట్ క్రికెటర్ రోహిత్ శర్మ అని పేర్కొన్న సిమి సింగ్.. తాను ఎక్కువగా అభిమానించే క్రికెటర్‌గా బౌలింగ్ చేయాలని అనుకోవడం లేదన్నాడు. ‘మొహాలీలో నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కనేవాడిని. కానీ, పంజాబ్‌కు క్రికెట్ ఆడే సమయంలో నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో నేను చదువు కోసం ఐర్లాండ్ వెళ్లిపోయాను. కానీ, ఇప్పుడు ఐర్లాండ్ జాతీయ జట్టుకు ఆడుతున్నాను. ఐర్లాండ్ వచ్చినప్పటి నుంచి నేను ఏ క్రికెట్ మైదానంలో అయితే ప్రాక్టీస్ చేశానో, చిన్నారులకు శిక్షణ ఇచ్చానో ఇప్పుడు అదే మైదానంలో భారత్-ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌లు జరగబోతున్నాయి. ఇదో గొప్ప అనుభూతి. నా కెరీర్‌లో ఎప్పటికీ మరిచిపోలేను. ఇప్పటి వరకు నేను మహేంద్ర సింగ్‌ధోనీ, విరాట్ కోహ్లీని కలిసింది లేదు. టీవీలో వారు ఆడుతుంటే చూశాను అంతే. చండీగఢ్‌లో నేను కాలేజీలో చదివే సమయంలో చాహల్, సిద్దార్థ్ కౌల్‌తో కలిసి ఆడాను. ఇప్పుడు ఐర్లాండ్ పర్యటనకు ఆ ఇద్దరూ వచ్చారు. భారత జట్టుతో ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా అభిమాన క్రికెటర్ రోహిత్ శర్మ. అతనికి బౌలింగ్ చేయాలని అనుకోవడం లేదు(నవ్వుతూ)’ అని సిమి తెలిపాడు. ఈ నెల 27, 29న భారత్-ఐర్లాండ్ మధ్య రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment