
PC: BCCI
టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ (Sreesanth)కు కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) భారీ షాకిచ్చింది. కేరళ క్రికెట్ వ్యవహారాలతో సంబంధం లేకుండా.. అతడిని మూడేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. సంజూ శాంసన్ (Sanju Samson) విషయంలో శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని తెలుస్తోంది.
సంజూకు కేసీఏతో విభేదాలు?
కాగా కేరళకు చెందిన శ్రీశాంత్ మాదిరే సంజూ శాంసన్ కూడా టీమిండియా తరఫున రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు సంజూకు కేసీఏతో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. శిక్షణా శిబిరానికి హాజరు కానందున ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను కేసీఏ సెలక్టర్లు దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి ఎంపిక చేయలేదు.
కేసీఏ బారి నుంచి కాపాడుతానంటూ
దీంతో ఐసీసీ మెగా వన్డే టోర్నీకి ముందు సంజూ ఇలా దేశీ ఈవెంట్‌కు దూరం కావడంతో సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌కు మద్దతుగా మాట్లాడుతూ శ్రీశాంత్ కేసీఏను విమర్శించాడు.
అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న ఆటగాళ్లకు మద్దతుగా ఉండాల్సిన అసోసియేషన్ ఇలా చేయడం సరికాదని.. తాను స్థానిక కేరళ క్రికెటర్లను కేసీఏ బారి నుంచి కాపాడుతానంటూ శ్రీశాంత్ వ్యాఖ్యలు చేశాడు. స్థానిక ఆటగాళ్లను కాదని.. వేరే రాష్ట్రాల వారికి కేసీఏ అవకాశాలు ఇస్తోందని ఆరోపించాడు. ఎంతో మంది అనుభవజ్ఞులైన, నైపుణ్యాలు ఉన్న ఆటగాళ్లను కూడా ఎదగనివ్వడం లేదంటూ ఆరోపణలు చేశాడు.
మూడేళ్ల పాటు సస్పెండ్
ఇక శ్రీశాంత్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేసీఏ అతడిపై చర్యలు చేపట్టింది. ఈ మేరకు.. అసత్యపు, నిరాధార వ్యాఖ్యలతో మా పరువుకు భంగం కలిగించేలా మాట్లాడిన శ్రీశాంత్‌ను మూడేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. సంజూకు మద్దతుగా ఉన్నందుకు తాము ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని.. అసోసియేషన్‌ను కించపరిచేలా మాట్లాడినందుకే ఇలా చేశామని స్పష్టం చేసింది.
కాగా కేరళ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఏరీస్ కొల్లామ్ సెయిలర్స్ ఫ్రాంఛైజీకి శ్రీశాంత్ సహ యజమానిగా ఉన్నాడు. అయితే, తమను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ.. కేసీఏ శ్రీశాంత్‌తో పాటు కొల్లామ్ ఫ్రాంఛైజీతో పాటు అలెప్పీ టీమ్. కంటెంట్ క్రియేటర్ సాయి క్రిష్ణన్, అలెప్పీ రిపుల్స్‌కు కూడా నోటీసులు ఇచ్చింది.
అయితే, షోకాజ్ నోటీసులకు శ్రీశాంత్ మినహా వీళ్లంతా తమకు సంతృప్తికర సమాధానాలు ఇచ్చారని కేసీఏ పేర్కొంది. అందుకే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపింది.
టీమిండియా తరఫున సత్తా చాటుతూ.. ఇద్దరూ ఇద్దరే
కాగా శ్రీశాంత్ 2005 నుంచి 2011 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.. 27 టెస్టులు, 53 వన్డేలు. 10 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. టెస్టుల్లో 87, వన్డేల్లో 75, టీ20లలో ఏడు వికెట్లు కూల్చాడు. టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 గెలిచిన భారత జట్టలో అతడు సభ్యుడు.
మరోవైపు.. కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 16 వన్డేలు, 42 టీ20 మ్యాచ్‌లు ఆడి.. 510, 861 పరుగులు చేశాడు. అతడి అంతర్జాతీయ కెరీర్‌లో ఒక వన్డే, మూడు టీ20 శతకాలు ఉండటం విశేషం. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో సంజూ ఉన్నాడు.
చదవండి: వైభవ్ వయసు పిల్లలంతా హ్యాపీ.. ఎందుకింత ఓర్వలేని తనం?