ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్‌కు భారీ షాక్ తగిలింది. కేరళ క్రికెట్ అసోసియేషన్ అతడి విషయంలో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తోంది. కాగా దేశవాళీ క్రికెట్‌లో సొంత రాష్ట్రం కేరళకు సంజూ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
అప్పుడు కెప్టెన్‌గా
ఇటీవల దేశీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేరళ జట్టుకు సంజూ శాంసన్(Sanju Samsom) కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఈ వికెట్ కీపర్ బ్యాటర్ సారథ్యంలో కేరళ కనీసం నాకౌట్ దశకు చేరకుండానే నిష్క్రమించింది. ఇక ఈ టోర్నమెంట్లో సంజూ ఆరు మ్యాచ్‌లు ఆడి 135 పరుగుల చేయగలిగాడు.
ఈ క్రమంలో దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25) నేపథ్యంలో సంజూ శాంసన్‌కు మొండిచేయి ఎదురైంది. కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) తాము ఈ టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో సంజూకు చోటివ్వలేదు.
అందుకే అతడిని ఎంపిక చేయలేదు
ఈ విషయం గురించి కేసీఏ కార్యదర్శి వినోద్ ఎస్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘డిసెంబరు 13- 17 వరకు విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ కోసం నిర్వహించే సన్నాహక శిబిరానికి హాజరు కాలేనని సంజూ మాకు ఇ- మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చాడు.
అయితే, సెలక్షన్ ప్రక్రియ ప్రకారం.. ఈ శిబిరంలో పాల్గొన్న ఆటగాళ్ల పేర్లనే జట్టు ఎంపిక సమయంలో మేము పరిగణనలోకి తీసుకుంటాం’’ అని పేర్కొన్నాడు. అందుకే సంజూ శాంసన్‌ను తాము పక్కనపెట్టినట్లు వినోద్ ఎస్ కుమార్ స్పష్టం చేశాడు.
ఇక తాజా సమాచారం ప్రకారం.. తాను దేశీ వన్డే టోర్నీకి అందుబాటులో ఉంటానని సంజూ శాంసన్ కేసీఏకు తెలిపాడు. కానీ.. సెలక్టర్లు మాత్రం అతడిని పక్కన పెట్టేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి వినోద్ ఎస్ కుమార్ తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడాడు.
సంజూ వస్తానన్నాడు.. కానీ మా జట్టు నిండుగా ఉంది
‘‘తాను జట్టుకు అందుబాటులో ఉంటానని సంజూ శాంసన్ రెండు రోజుల క్రితమే మాకు సమాచారం ఇచ్చాడు. అయితే, ఇప్పటి వరకు ఈ విషయమై మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే.. ఇప్పటికే ఈ టోర్నీ ఆడేందుకు కేరళకు చెందిన పూర్తి స్థాయి జట్టు అందుబాటులో ఉంది’’ అని వినోద్ కుమార్ పేర్కొన్నాడు. తద్వారా సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకునే ఆలోచన లేదని పరోక్షంగా స్పష్టం చేశాడు.
అదే జరిగితే.. సంజూకి కష్టమే!
కాగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ(వన్డే)-2025 మొదలుకానున్న విషయం తెలిసిందే. ఈ ఐసీసీ టోర్నీకి ఎంపికయ్యే భారత జట్టులో స్థానం సంపాదించుకోవాలంటే సంజూకు విజయ్ హజారే ట్రోఫీ రూపంలో అవకాశం వచ్చింది. అయితే, కారణాలేవైనా అతడు.. ఈ దేశీ వన్డే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండటం.. కేసీఏకు రుచించలేదు.
దీంతో ఇప్పుడు స్వయంగా అందుబాటులోకి వచ్చినా.. అతడి పట్ల విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టోర్నీ మొత్తంలో ఆడే అవకాశం రాకపోతే సంజూకు చాంపియన్స్ ట్రోఫీ ఆడే మార్గం దాదాపుగా మూసుకుపోయినట్లే!
ఇక విజయ్ హజారే ట్రోఫీలో కేరళకు శుభారంభం లభించలేదు. తొలి మ్యాచ్‌లో బరోడా చేతిలో చిత్తుగా ఓడిన కేరళ.. రెండో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌తో తలపడింది. అయితే, వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్ ముగిసిపోయింది.
ప్రొటిస్ గడ్డపై శతకాల మోత
కాగా సంజూ శాంసన్ చివరగా టీమిండియా తరఫున సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. నవంబరులో ముగిసిన ఈ సిరీస్‌లో సంజూ రెండు శతకాలు బాది.. టీమిండియా ప్రొటిస్ జట్టుపై నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. కేరళ తరఫున ఇప్పటి వరకు 119 లిస్ట్-‘ఎ’(వన్డే ఫార్మాట్)మ్యాచ్‌లు ఆడిన సంజూ శాంసన్.. 3487 పరుగులు సాధించాడు.
చదవండి: నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.. అప్పుడైనా..: టీమిండియా దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment