
ప్రశాంతమైన పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు (IND vs PAK)తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోమని పునరుద్ఘాటించింది. ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ.. ముష్కరుల చర్యను తీవ్రంగా ఖండించింది.
పాకిస్తాన్‌తో ఇకపై కూడా..
బీసీసీఐ తరఫున కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajiv Shukla) ఈ మేరకు తమ స్పందన తెలియజేశారు. రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘బాధిత కుటుంబాలకు మా మద్దతు. ఉగ్రవాదుల చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రభుత్వ నిర్ణయానికి మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం. పాకిస్తాన్‌తో ఇకపై కూడా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోము. ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటాం. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అంశం గురించి సమీప భవిష్యత్తులో కనీసం చర్చ కూడా ఉండదు.
అయితే, ఐసీసీ ఈవెంట్లలో మాత్రం నిబంధనలకు అనుగుణంగా పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రస్తుత పరిస్థితులను ఐసీసీ కూడా నిశితంగా గమనిస్తోంది’’ అని స్పోర్ట్స్‌తక్‌తో పేర్కొన్నారు.
మాటలకు అందని విషాదం
ఇక బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. ‘‘పహల్గామ్‌లో జరిగిన పాశవిక ఉగ్రదాడి కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి.
బీసీసీఐ తరఫున ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం. ఈ కష్ట సమయంలో వారంతా ధైర్యం కోల్పోకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాం.
వారి జీవితాల్లో చోటు చేసుకున్న ఈ విషాదాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవడం లేదు. మనమంతా వారికి అండగా ఉండాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు.
బాధితులకు నివాళి
కాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్-2025లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ బాధితులకు నివాళి అర్పించింది. ఆటగాళ్లంతా నిమిషం పాటు మౌనం పాటించారు. అదే విధంగా చీర్‌లీడర్స్ ప్రదర్శనలు లేకుండా చూసుకున్నారు. బాణసంచా కూడా కాల్చలేదు.
చివరగా 2008లో
ఇదిలా ఉంటే.. భారత జట్టు చివరగా 2008లో పాకిస్తాన్‌లో పర్యటించింది. అదే విధంగా పాక్ జట్టు 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు భారత్‌కు వచ్చింది. ఆ తర్వాత ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 ఆడేందుకు పాక్ జట్టు భారత పర్యటనకు రాగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా మాత్రం అక్కడకు వెళ్లలేదు.
భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. ఐసీసీ జోక్యంతో తటస్థ వేదికైన దుబాయ్‌లో రోహిత్ సేన తమ మ్యాచ్‌లు ఆడింది. ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలవగా.. ఆతిథ్య పాక్ జట్టు ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది.
కాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గల బైసారన్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి దిగారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన ఈ ప్రదేశాన్ని చూసేందుకు వచ్చిన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు.
చదవండి: Pahalgam Incident: "గౌతమ్ గంభీర్‌ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు