చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? అన్న అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించే తమ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశాడు. కాగా వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19- మార్చి 9 వరకు చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించనున్నారు.
పాల్గొనే జట్లు ఇవే
ఈ ఐసీసీ టోర్నీకి వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియా, ఆతిథ్య పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్ అర్హత సాధించాయి. అయితే, పాక్‌లో ఈ ఈవెంట్ జరుగనుండటంతో రోహిత్ సేన అక్కడికి వెళ్లకుండా.. తమ మ్యాచ్‌లను తటస్థ వేదికలపై ఆడనుందనే వార్తలు వచ్చాయి. అయితే, పాక్ బోర్డు మాత్రం ఇందుకు ససేమిరా అంటోందని.. టీమిండియాను తమ దేశానికి రప్పించే బాధ్యతను ఐసీసీకి అప్పగించినట్లు తెలిసింది.
భారత ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాతే
ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ వేదికను పాకిస్తాన్ నుంచి తరలించే యోచన లేదని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ పేర్కొనడం ఇందుకు బలాన్నిచ్చింది. అయితే, బీసీసీఐ కూడా వెనక్కి తగ్గే సూచనలు కనబడటం లేదు. ఈ క్రమంలో తాజాగా ఈ విషయంపై రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడం గురించి మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
భారత ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాతే అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం మేము వివిధ దేశాలకు ప్రయాణిస్తాం. ఇప్పుడు కూడా అంతే. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే అందుకు అనుగుణంగానే మా కార్యాచరణ ఉంటుంది. మా జట్టు ఒక దేశానికి వెళ్లాలా లేదా అనేది భారత ప్రభుత్వమే నిర్ణయిస్తుంది’’ అని స్పష్టం చేశాడు.
కాగా ముంబై దాడుల తర్వాత టీమిండియా- పాకిస్తాన్ ఇంతవరకు ద్వైపాక్షిక సిరీస్‌లలో ముఖాముఖి తలపడలేదు. చివరగా 2008లో భారత జట్టు పాక్ పర్యటనకు వెళ్లింది. అయితే, గతేడాది వన్డే వరల్డ్‌కప్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టు ఇక్కడకు వచ్చింది.
చదవండి: IND vs BAN: విరాట్ కోహ్లి వరల్డ్ రికార్డు.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే
Comments
Please login to add a commentAdd a comment