
టీమిండియా విజయాలను తక్కువ చేసే విధంగా మాట్లాడేవారికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) నిర్ణయానుసారమే భారత్ దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతోందన్నారు. గెలుపు కోసం పిచ్‌లపై ఆధారపడే దుస్థితిలో టీమిండియా లేదని.. వేదిక ఒకటే అయినా వేర్వేరు పిచ్‌లపై ఆడుతున్న విషయాన్ని గమనించాలని శుక్లా పేర్కొన్నారు.
అజేయంగా ఫైనల్‌కు
అదే విధంగా చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ఫైనల్ లాహోర్‌లో జరిగితే బాగుండేదన్న పాకిస్తాన్ జర్నలిస్టు ప్రశ్నకు రాజీవ్ శుక్లా ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాక్ పంపేందుకు బీసీసీఐ నిరాకరించగా.. ఐసీసీ జోక్యంతో తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడేలా రోహిత్ సేనకు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో గ్రూప్-ఎ నుంచి పోటీపడిన టీమిండియా అజేయంగా ఫైనల్‌కు చేరింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించిన భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై గెలుపొందింది.
కానీ, ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియాకు అదనపు ప్రయోజనాలు చేకూరుతున్నాయని ఇంగ్లండ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు ప్రముఖంగా గళం వినిపించారు.
ఐసీసీ నిబంధన ప్రకారమే
ఈ క్రమంలో లాహోర్‌లో జరిగిన సౌతాఫ్రికా- న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు హాజరైన రాజీవ్ శుక్లా పైవిధంగా స్పందించారు. అదే విధంగా.. భారత్- పాక్ ద్వైపాక్షిక సిరీస్‌ల గురించి ప్రస్తావన రాగా.. ‘‘భారత ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే మేము నడుచుకుంటాము. పాక్ క్రికెట్ బోర్డు కూడా వారి ప్రభుత్వం చెప్పినట్లే చేస్తుంది.
ఇరుజట్లు.. ఒకరి దేశంలో మరొకరు ఆడితే చూడాలని భారత్- పాక్ అభిమానులు కోరుకుంటున్నారని మాకు తెలుసు. అయితే, పరిస్థితులకు అనుగుణంగానే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. ఐసీసీలో ఒక నిబంధన ఉంది. ప్రభుత్వాల సమ్మతితోనే బోర్డులు ముందుకు వెళ్లాలి. బీసీసీఐ, పీసీబీ ఆ నిబంధనను పాటిస్తున్నాయి.
అయితే, భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లకు ఉన్న ఆదరణ దృష్ట్యా ప్రతీ దేశం దాయాదుల పోరుకు ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా సుదీర్ఘకాలం తర్వాత పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఇదొక శుభపరిణామం. టోర్నీ సజావుగా సాగేలా చేశారు’’ అని రాజీవ్ శుక్లా పీసీబీని ప్రశంసించారు.
ఆసీస్ ఓడిపోయింది కదా!
ఇక లాహోర్‌లో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగితే బాగుండేది కదా అని ఓ పాకిస్తాన్ జర్నలిస్తు రాజీవ్ శుక్లాను ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘మీరన్నట్లు జరగాలంటే ఆస్ట్రేలియా గెలిచి ఉండాల్సింది. కానీ వాళ్లు ఓడిపోయారు కద! అందుకే ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లోనే జరుగబోతోంది’’ అని రాజీవ్ శుక్లా కౌంటర్ ఇచ్చారు.
ఇక ఆసియా కప్ షెడ్యూలింగ్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఆసియా క్రికెట్ మండలి నిర్ణయాల ప్రకారం అంతా జరుగుతుంది. ఆసియా కప్ గురించి చర్చించేందుకు కూడా నేను ఇక్కడకు వచ్చాను. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఐసీసీ చైర్మన్ జై షా కూడా ఈ విషయంలో సహకరిస్తున్నారు’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.
కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్... గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడగా.. భారత్- న్యూజిలాండ్.. ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా సెమీస్ చేరాయి. అయితే, తొలి సెమీ ఫైనల్లో ఆసీస్‌ను భారత్.. రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను కివీస్ ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment