
కౌన్సిల్ సమావేశం రసాభాస
● బుచ్చిరెడ్డిపాళేనికి నుడా నుంచి రూ.కోటి కేటాయింపు
● టీడీపీకి మద్దతు తెలిపిన 10 మంది కౌన్సిలర్లకు అభివృద్ధి నిధులు
● ఏకపక్షంగా కేటాయించడంపై
వైఎస్సార్సీపీ నిలదీత
● వాకౌట్ చేసిన వైనం
బుచ్చిరెడ్డిపాళెం(కోవూరు): బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదాలతో రసాభాసగా మారింది. కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని చైర్‌పర్సన్ మోర్ల సుప్రజ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. 38 అంశాలతో అజెండాను కౌన్సిల్ ఆమోదం కోసం పెట్టారు. నగర పంచాయతీ అభివృద్ధికి రూ.కోటిని నుడా కేటాయించింది. ఈ క్రమంలో టీడీపీకి మద్దతుగా నిలిచిన 10 మంది కౌన్సిలర్లకు సంబంధించిన వార్డుల్లో వివిధ అభివృద్ధి పనులకు వీటిని కేటాయిస్తూ తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తప్పుబట్టారు. తమ వార్డుల్లో అనేక సమస్యలున్నాయని, నిధులు కేటాయించాలంటూ ముందుగానే ప్రతిపాదనలు చేశామని నిలదీశారు. చైర్‌పర్సన్ ఏకపక్ష నిర్ణయాలను ఖండించారు. అజెండాలోని అంశాలపై చర్చించాలని చైర్‌పర్సన్ కోరగా, తాము వాకౌట్ చేస్తున్నామని, మీరే చర్చించుకొని ఆమోదించుకోవాలని స్పష్టం చేశారు.
38 అంశాలతో అజెండా
నగర పంచాయతీకి సంబంధించిన 38 అంశాలతో అజెండాను పొందుపర్చారు. నగర పంచాయతీ సాధారణ నిధులతో బుచ్చిరెడ్డిపాళెం పరిధిలో ఫాగింగ్, స్ప్రే చేసేందుకు అవసరమైన కెమికల్స్ కొనుగోలుకు రూ.1.5 లక్షలు, గృహ నిర్మాణాలు తదితరాలను కౌన్సిల్ ఆమోదం కోసం ప్రతిపాదించారు.
ఎమ్మెల్యే పర్యటనలపై సమాచారమేదీ..?
స్థానిక కౌన్సిలర్లకు సమాచారం లేకుండా వార్డుల్లో ఎలా పర్యటిస్తారని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని కౌన్సిలర్ షాహుల్ ప్రశ్నించారు. సమాచారమివ్వకుండా షెడ్యూల్‌ను ఖరారు చేయడంపై కమిషనర్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష కౌన్సిలర్లకు తమ సమస్యలను తెలియజేసే అవకాశం కల్పిస్తామంటూ కారెక్కి ఆమె వెళ్లిపోయారు.
అజెండా ఆమోదం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వాకౌట్ చేసిన అనంతరం అజెండా అంశాలను ఏకవాక్యంతో చైర్‌పర్సన్ ఆమోదిస్తూ తీర్మానం చేశారు. మిగిలిన కౌన్సిల్ సభ్యులూ ఆమోదం తెలిపారు. ఇటీవల నూతనంగా ఎన్నికై న వైస్ చైర్మన్లు ప్రమాణ స్వీకా రం చేశారు.